ఆచరణాత్మకతను అక్షరాలా ఆచరించి చూపిన మహా గురువు శ్రీరామకృష్ణ పరమహంస. స్వామి వివేకానందకు గురువుగా అందరికీ సుపరిచితులే. స్వామి వివేకానంద మాదిరిగానే అనేకమంది శిష్యులకు శిక్షణ ఇచ్చారు. 1836 ఫిబ్రవరి 18న పశ్చిమబెంగాల్ హూగ్లీ జిల్లా కామార్‌పుకూర్‌లో నిరుపేదలైన సంప్రదాయ కుటుంబంలో శ్రీరామకృష్ణ పరమహంస జన్మించారు. తల్లిదండ్రులు ఖుదీరామ్ చటోపాధ్యాయ, చంద్రమణీదేవి శ్రీరామకృష్ణ పరమహంసను చిన్నప్పుడు గదాధరుడనే పేరుతో కూడా పిలిచేవారు. చిన్ననాటినుంచే శ్రీరామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక భావనలు ఎక్కువగా ఉండేవి. చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, పురాణాలు అధ్యయనం చేశారు. తండ్రి మరణంతో కుటుంబమంతా 1852లో కోల్‌కతాకు మారింది. సోదరుడికి శ్రీరామకృష్ణ పరమహంస దక్షిణేశ్వర్‌లోని కాళికామాత ఆలయపనుల్లో సహకరిస్తుండేవారు. 1859లో శ్రీరామకృష్ణ పరమహంసకు శారదామణి ముఖోపాధ్యాయ(శారదా మాత)తో వివాహమైంది.
1864లో మహానిర్వాణి అఖాడాకు చెందిన నాగసాధువు తోతాపురి దక్షిణేశ్వర్ సందర్శించారు. శ్రీ రామకృష్ణ పరమహంసను జాగ్రత్తగా పరిశీలించారు. అనేక విషయాలపై ముచ్చటించారు. ఆయనలోని భక్తిని మెచ్చుకున్నారు. చివరకు పంచవటిలో శ్రీరామకృష్ణ పరమహంసకు తోతాపురి దీక్షనిచ్చారు. అంతకు ముందే శ్రీరామకృష్ణ పరమహంస తంత్ర విద్యను అధ్యయనం చేశారు. ఆ తర్వాత 1866లో ఇస్లాం, క్రైస్తవాన్ని కూడా అధ్యయనం చేశారు.
1881లో స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. 1882లో స్వామి వివేకానంద దక్షిణేశ్వర్ వెళ్లి శ్రీరామకృష్ణ పరమహంసను మరోసారి కలుసుకున్నారు. అప్పటినుంచి వివేకానందుడిలో ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమైంది. 1884లో తండ్రి మరణం తర్వాత కుటుంబాన్ని ఆర్ధిక సమస్యలనుంచి గట్టెక్కించాలని స్వామి వివేకానంద తన గురువైన శ్రీరామకృష్ణ పరమహంసను ప్రార్ధించారు. స్వయంగా కాళిమాతనే ప్రార్ధించాలని ఆయన మూడుసార్లు స్వామి వివేకానందను ఆలయంలోకి పంపారు. అయితే మూడుసార్లు కూడా విచిత్రంగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను మాత్రమే స్వామి వివేకానంద కోరుకున్నారు. ఆ తర్వాత గురువు సన్నిధిలో స్వామి వివేకానంద అనేక ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నారు. గురువు సమక్షంలో స్వామి వివేకానంద భగవానుభవాన్ని పొందారు. 1886 ఆగస్ట్ 16న శ్రీరామకృష్ణ పరమహంస మహాసమాధి చెందారు.
Narayana, Sr Journalist
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..