Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు.. ఆ పండగ విశిష్టత ఎంటో తెలుసా.. పూజా విధానం..

|

May 10, 2021 | 12:52 PM

Akshaya Tritiya 2021: భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ పర్వదినానికి ప్రత్యేకతలు ఎక్కువగానే ఉన్నాయి.

Akshaya Tritiya 2021: అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారు.. ఆ పండగ విశిష్టత ఎంటో తెలుసా.. పూజా విధానం..
Akshya Tritiya 1
Follow us on

Akshaya Tritiya 2021: భారతదేశంలో జరుపుకునే అన్ని పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ పర్వదినానికి ప్రత్యేకతలు ఎక్కువగానే ఉన్నాయి. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ పేరుతో హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడిగా నియమితుడైన రోజు, మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం కూడా ఇదే. ఈరోజు బంగారం కొని లక్ష్మీ దేవిని అలంకరించి పూజ చేస్తారు. ఇలా చేస్తే ఇల్లు సిరిసంపదలతో వర్తిల్లుతుందని భక్తుల నమ్మకం. ఇవే కాకుండా ఈ పండగకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రోజు చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు అక్షయమైన ఫలితాలనిస్తాయి. ఇదే విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం వివరిస్తోంది. అక్షయ తృతీయనాడు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలానిస్తాయని నారద పురాణం చెబుతోంది. ఈ శుభ తిథిన ఏ పనిచేసినా అది విజయవంతం అవుతుంది. అలాగే ఈ రోజు దుర్ముహూర్తాలూ, వర్జ్యాలూ ఉండవు. ఈ తిథి రోజు మొత్తం శుభకార్యాలను జరపించుకోవచ్చు.

అక్షయ తృతీయతో సంబంధం ఉన్న ఇతిహాసాలు..

త్రేతాయుగం మొదలై.. విష్ణు స్వరూపుడయిన పరశురాముడు జన్మించింది ఇదే రోజున అని చెబుతుంటారు. అలాగే శ్రీ కృష్ణుడి సోదరుడు బలరాముడు జన్మించిన రోజుగా చెబుతుంటారు. అరణ్యవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు ఇదే. కురు సభలో తనకు జరుగుతోన్న అవమానానికి నీవే దిక్కంటూ చేతులు జోడించి వేడుకున్న ద్రౌపదికి దేవదేవుడు అక్షయంగా చీరలు ఇచ్చిందీ ఈ రోజే. మహాభారత కావ్యాన్ని వేదవ్యాసుడు రాయడం ప్రారంభించిందీ, శివుని జటాజూటం నుంచీ భూలోకానికి గంగ చేరింది కూడా ఈ సుదినమే.

అలాగే శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుదామా.. తన పాడైన అటుకులు తీసుకోని శ్రీకృష్ణుడిని కలవడానికి వస్తాడు. ఇక సుదామా పరిస్థితి తెలుసుకున్న కృష్ణుడు అతనికి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తాడు. దీంతో సుదామా భాధలు, పేదరికం మొత్తం తొలగిపోతుంది. ఈ సంఘటన తృతీయ తిథి.. వైశాఖ, శుక్ల పక్షాలలో జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

అంతటి విశిష్టత ఉన్న ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలంటు స్నానం చేసి, విష్ణుమూర్తిని పూజించాలి. పూజలోని అక్షితలు తలమీద వేసుకుని, శక్తిమేర దానధర్మాలు చేయాలి. కొందరు ఈ రోజు ‘వైశాఖ పూజ’ చేస్తారు. ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే మజ్జిగ, పానకం, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు, గంధం దానం చేస్తారు. ఎండలు మండిపోయే వైశాఖంలోని ఈ పుణ్యదినాన ఎవరి గొంతు చల్లబరచినా, ఎవరికైనా కాస్త దానం చేసినా ఆ ఫలితం అక్షయమవుతుంది.

Also Read: ఈ ఆలయంలో హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజిస్తుంటారు… ఇంతకీ ఆ గుడి ఎక్కడుందో తెలుసా..

రాత్రిళ్లు భక్తుల ప్రాణాలను తీసే అమ్మవారి ఆలయం.. నైట్ అయితే చాలు భయంతో పారిపోతున్న జనం.. ఆ గుడి ఎక్కడుందంటే..