ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత.. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరులో వెలసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాడ మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆషాడ మాసం మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. లలిత స్వరూపిణిగా పేరుగాంచిన శ్రీ తలుపులమ్మ అమ్మవారికి.. గాజుల అలంకరణ.. పుష్పాలంకరణ అలాగే పలురకాల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేశారు. ఆరాధ్య దేవతను దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ఒరిస్సాల రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకొని .. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు.
రైతులకు పాడి పంట సమృద్ధిగా ఉండాలని ఆషాడ మాసంలో అమ్మవారికి విశేష అలంకరణలు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఆషాడమాస మహోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు అధికారులు. వసతి గదులు నిండిపోవడంతో కొండ దిగువున ఉన్న ప్రాంతంలోని పూరిపాకల్లో కూడా వసతిని ఏర్పాటు చేశారు. తలుపులమ్మ తల్లి కొలువైన ఈ ప్రాంతం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు.. కొండలు, కోనలు పచ్చని ప్రకృతితో కూడిన ఆహ్లాదకర వాతావరణంతో తలుపులమ్మ క్షేత్రం భక్తులకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఇక ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పెద్దాపురం డి.ఎస్.పి లతా కుమారి ఆధ్వర్యంలో రూరల్ సీఐ పట్టణ సిఐలు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..