ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శాకాంబరీదేవి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢమాసంలో ఏటా నిర్వహించే శాకంబరి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటీవ్ అధికారి భ్రమరాంబ మాట్లాడుతూ ఈనెల 13 వరకు నిర్వహించే శాకాంబరి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని ఏటా ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా మూడు రోజుల పాటు శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారిని ఆకుకూరలు, పళ్లు, కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేశారు. తొలుత దాతలు ఇచ్చిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు పూజాదికాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ మూడు రోజులపాటు అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.
చివరి రోజున ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే పండ్లతో ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించిన పూలు, పండలపై వాటిపైన పసుపు కుంకుమ చల్లించి శాస్త్రోక్తంగా అలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ అధికారులు. మూలవిరాట్ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో అలంకరించారు. శాకాంబరిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శాకంబరీని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు, ప్రధానంగా వర్షాలు కురుస్తాయని భక్తుల విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి