Samatha Kumbh 2026: వైభవంగా సమతాకుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు
సమతాకుంభ్ 2026 బ్రహ్మోత్సవాలు సకల జనుల సంబురంగా సాగుతున్నాయి. నిత్యక్రతువులు.. దేవతారాధనలతో ముచ్చింతల్ శ్రీరామనగరం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. రామానుజాచార్యులను స్మరిస్తూ నూత్తందాది పాశురములను పఠించారు. ఉత్సవాల నాలుగో రోజు సాకేత రామచంద్ర ప్రభువు, హనుమద్వాహనంపై విహరించారు. .. .. ..

సమతా కుంభ్ -2026, శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల నాల్గవ బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి.
బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. దీన్నే ప్రపన్నగాయత్రి అంటారు. రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు.
సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాది రచించారు. రామానుజులను ఆశ్రయించిన వారికి సంసారాన్ని జయించే అనుగ్రహము లభిస్తుందని నమ్మకం! సమాజంలో అందరూ సమానమే అన్న మహోన్నత సందేశాన్ని శ్రీరామానుజాచార్య వెల్లడిస్తారన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి.
ఉత్సవాల్లో అత్యంత ప్రత్యేకమైనది హనుమద్వాహన సేవ. హనుమంతుడు శ్రీరాముడి శరణాగతికి, భక్తికి ప్రతీకగా నిలుస్తాడు. ఈ సేవలో స్వామివారు హనుమంతునిపై ఊరేగుతూ భక్తులకు శరణాగతి తత్వాన్ని తెలియజేస్తారు. కోరిన కొర్కెలు తీర్చే శ్రీరాముడు హనుమద్వాహనంపై పురువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. నేత్రపర్వంగా సాగిన ఈ సేవలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ఊరేగింపు వైభవంగా సాగింది. ముచ్చింతల్‌లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో వైదిక కార్యక్రమాలతో పాటు మరెన్నో విశేషోత్సవాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
సమతాకుంభ్ 2026 బ్రహ్మోత్సవాల్లో..ప్రతి వేడుక మహాద్భుతం. అందులో కనులపండువగా సాగేదే శాంతి కల్యాణ మహోత్సవం. భక్తితో సమర్పించే పుష్పాలను సంతోషంగా స్వీకరించే కారుణ్య మూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే.! ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా వుంటాడా! ఈనెల 4న..ఒకే వేదికపై 108 దేవదేవేరులకు జరగబోయే కల్యాణ మహోత్సవానికి ముచ్చింతల్ వేదిక కాబోతుంది.
