హిందూ మతంలో గంగా జలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రాచీన కాలం నుంచి మనదేశంలో గంగా నదిని తల్లిలాగా, అందులోని నీటిని అమృతంగా భావిస్తారు. గంగాదేవిని మోక్ష ప్రదాత అంటారు. అందుచేత మరణించిన తర్వాత గంగాజలం నోటిలో పోసే సంప్రదాయం ఉంది. గంగా దేవి నీరు చాలా స్వచ్ఛమైనది. నదిలోని నీరు ఎన్నటికీ పాడవదు.. అంతేకాదు ఎటువంటి హానికరమైన బ్యాక్టీరియా కూడా గంగనీటిలో జీవించదు. ఈ కారణంగా కూడా గంగాజలం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
హిందూ మత విశ్వాసాల ప్రకారం గంగానదిలో స్నానం చేయడం వల్ల మనుషులు చేసిన అన్ని పాపాలు నశించి పవిత్రంగా మారుతారు . ఈ కారణంగానే గంగా నదిలో స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందువుల పండగలు, పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు గంగా నదిలో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. పూజలో కూడా పవిత్ర గంగాజలం ఉపయోగించబడుతుంది. దాదాపు అందరు హిందువులు గంగాజలాన్ని తమ ఇళ్లలో లేదా తమ ఇంటిలోని పూజ గదిలో గంగా జలాన్ని ఉంచుకుంటారు. అయితే గంగాజలాన్ని ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
చాలా మంది గంగాజలాన్ని ప్లాస్టిక్ సీసాలో లేదా డబ్బాలో నింపుకుని ఇంటికి వస్తారు. ఇంట్లో అలాగే ఆ డబ్బాల్లోనే ఉంచుకుంటారు. అయితే ఇలా చేయటం చాలా తప్పుగా పరిగణించబడుతుంది. గంగాజలం చాలా పవిత్రమైనది. కాబట్టి దానిని ఉంచే పాత్ర కూడా స్వచ్ఛంగా ఉండాలి. వెండి, రాగి, ఇత్తడి లేదా మట్టి పాత్రలో గంగాజలాన్ని ఉంచడం సముచితంగా పరిగణించబడుతుంది.
మత విశ్వాసాల ప్రకారం గంగాజలాన్ని శుభ్రమైన, చీకటి ప్రదేశంలో ఉంచాలి. గంగాజలాన్ని ఉంచడానికి చీకటి, శుభ్రమైన ప్రదేశం మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది. గంగాజలాన్ని ఎండ ఉన్న ప్రదేశంలో లేదా బహిరంగ ప్రదేశంలో ఉంచకూడదు. వంటగది, బాత్రూమ్ దగ్గర గంగాజలం ఉంచకూడదు.
పూజా స్థలం దగ్గర గంగాజలం ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. గంగాజలాన్ని ఎక్కడ ఉంచారో ఆ ప్రదేశంలోని పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
గంగాజలాన్ని ఉంచే ప్రదేశం పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి. గంగాజలం ఏదైనా గదిలో ఉంచినట్లయితే, పొరపాటున కూడా మాంసాహారం లేదా మద్యం సేవించకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు