Puri Ratha Yatra: భక్తుడు కోసం ఎదురు చూసిన భగవంతుడు.. సాలబేగ్‌ కోసం ఆగిన జగన్నాథుని రథం

|

Jul 01, 2022 | 2:06 PM

తన భక్తుడు రాకకోసం.. ఏకంగా రథోత్సవాన్ని ఆపి మరీ ఎదురుచూశారు సాక్షాత్తు జగన్నాథుడు. ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా..భక్తుడి కోసం నిరీక్షించిన శ్రీకృష్ణుడి లీలల గురించి తెలుసుకుందాం..

Puri Ratha Yatra: భక్తుడు కోసం ఎదురు చూసిన భగవంతుడు.. సాలబేగ్‌ కోసం ఆగిన జగన్నాథుని రథం
Lord Jagannath And The Sal
Follow us on

Puri Ratha Yatra: ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం పూరి.. ఇక్కడ శ్రీకృష్ణడు జగన్నాథుడిగా భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. స్వామివారి తన అన్న బలరాముడు,  చెల్లెలు సుభద్రతో కలిసి రథం పై ఊరేగే ఉత్సవం గురించి ఎంత చెప్పినా తక్కువే. జగన్నాథుడి రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. భారీ సంఖ్యలో దేశ విదేశాల నుంచి రథోత్సవంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో జగన్నాథుడు లీలకు సంబంధించిన ఓ కథ గురించి తెలుసుకుందాం..  తన భక్తుడు రాకకోసం.. ఏకంగా రథోత్సవాన్ని ఆపి మరీ ఎదురుచూశారు సాక్షాత్తు జగన్నాథుడు. ఈరోజు జగన్నాథ రథయాత్ర సందర్భంగా..భక్తుడి కోసం నిరీక్షించిన శ్రీకృష్ణుడి లీలల గురించి తెలుసుకుందాం..

పూరీ జగన్నాథుడి భక్తులలో అగ్రగణ్యుడు సాలబేగ్. తండ్రి ముస్లిం లాల్‌బేగ్  , తల్లి లలిత ఒడియా బ్రాహ్మణ మహిళ. లలిత బాలవితంతువు.  లాల్‌బేగ్ మొఘల్ సేనలతో పాటుగా కళింగప్రాంతానికి వచ్చి.. పూరీలోని దండముకుందపూర్ లో గోపీనాథ ఆలయానికి వెళుతున్న లలితను చూశాడు. లలిత అందానికి ముగ్ధుడైన లాల్‌బేగ్ .. వెంటనే లలితను బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు.  కటక్లో  కాపురం పెట్టాడు. ఈ దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి సాలబేగ్ అనే పేరు పెట్టాడు. లలిత తన కొడుక్కి హిందూ ధర్మం, పూజలు, పురాణగాథలను చిన్నతనం నుంచి చెబుతూ ఉండేది.

యుక్త వయసులో సాల బేగ్ మొఘల్ సైన్యంలో చేరాడు.  మొఘలపై ఆఫ్ఘాన్ సైనికులు తిరుగుబాటు బావుటా ఎగురవేసి..  యుద్ధం ప్రకటించారు. దీంతో ఆఫ్ఘాన్లపై యుద్ధం చేయానికి తండ్రితో పాటు..సాలబేగ్ వెళ్ళాడు. యుద్ధంలో లాల్ బేగ్ మరణించగా.. సాల్ బేగ్ తీవ్రంగా గాయపడ్డాడు.  ఆ గాయాలతో తల్లిదగ్గరకు చేరుకున్నాడు.. ఇక మరణం తప్పదనుకున్న సమయంలో లలిత.. తన కొడుకు ప్రాణాలు కాపాడమని..  బాలముకుంద అనే సన్యాసిని ఆశ్రయించింది. సాలబేగ్ మంచం మీదనే.. తనను కాపాడమని..    శ్రీకృష్ణ కోరుతూ.. జపం చేశాడు. గాయాల నుంచి కోలున్నాడు. అప్పుడు పూరి క్షేత్రం.. అక్కడ కొలువైన శ్రీకృష్ణుడు మహిమల గురించి తెలుసుకున్నాడు. దీంతో  శ్రీక్షేత్రానికి చేరుకొని స్వామివారి దర్శనంకోసం వెళ్ళాడు..

ఇవి కూడా చదవండి

అయితే ముస్లిం కనుక సాల బేగ్ ను ఆలయంలోకి అనుమతినివ్వలేదు అప్పటి పూజారులు. అంతేకాదు క్షేత్రంలోని మఠంలో కూడా నివసించడానికి అనుమతిని నిరాకరించారు. దీంతో దేవదేవుడు రథం పై వచ్చే ‘బొడాదండా’ దారిలో ఒక చిన్న పూరిపాక కట్టుకుని.. అందులో నివసిస్తూ.. స్వామివారి రాకకోసం ఎదురుచూస్తూ గడపసాగారు.

జగన్నాథుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్న సాల బేగ్ కు కటక్ సుబేదారు మీర్జా అహ్మద్ బేగ్ పూరీపై యుద్ధానికి వస్తున్నట్లు తెలిసింది. దీంతో సాలబేగ్ .. మీర్జా అహ్మద్ బేగ్ దగ్గరకు వెళ్లి.. యుద్ధం వద్దని విరమింపజేశాడు. ఈ విషయం తెలిసి.. పూరీ రాజు నరసింగదేవ్ సంతోషపడ్డాడు. సాల బేగ్ ను ఏమైనా కోరుకోమంటే.. తనకు జగన్నాథుడు దర్శనం కల్పించామని కోరుకున్నాడు. రాజు స్వయంగా చెప్పినా.. అప్పటి ఛాందస పూజారులు సాల బేగ్ ను ఆలయంలో అడుగు పెట్టడానికి ఒప్పుకోలేదు.

దీంతో నిరాశ చెందిన సాల బేగ్.. కనీసం  శ్రీకృష్ణుడు నడయాడిన బృందావనంనైనా దర్శించుకుందామని అనుకున్నాడు. అక్కడ సాధుసజ్జనుల గోష్ఠిలో కాలక్షేపం చేస్తూ..  జగన్నాధునిపై కీర్తనలు రచించి, గానం చేయసాగాడు. ఇంతలో జగన్నాథుడు రథయాత్ర ఉత్సవం జరిగే సమయం ఆషాఢమాసం శుక్లపక్షం వచ్చింది.

ఈ యాత్రలో కులమతాలకు అతీతంగా ఎవరైనా జగన్నాథుని దర్శనం పొందవచ్చు. దీంతో ఎలాగైనా జగన్నాథుని దర్శనం చేసుకోవాలని..  బృందావనం నుంచి పూరికి బయలుదేరాడు. మార్గమధ్యలో అనారోగ్యానికి గురయ్యాడు దీంతో రథయాత్ర ప్రారంభమయ్యే శుక్లపక్షం రెండో రోజుకి పూరీ చేరుకోలేకపోయాడు. అయితే తనకు త్వరగా ఆరోగ్యం కుదుటిపడేలా చెయ్యి.. స్వామి..నేను నువ్వు రథయాత్రలో తిరుగు ప్రయాణం అయ్యే సమయానికి చేరుకుంటానని ప్రార్ధించసాగాడు. తాను ‘బాహుడా’ రోజుకి రావడం ఆలస్యమైతే తన కోసం జగన్నాథుడిని ఆగమని మనసులోనే ప్రార్ధించాడు.

ఆషాడ దశమి రోజున జగన్నాథుడు రథయాత్రలో తిరుగు పయనం అయ్యాడు. జగన్నాథుడిని రథం పైకి ఎక్కించారు. రథం కొద్ది దూరం వెళ్లి.. అక్కడ ఆగిపోయింది. ఎంతమంది భక్తులు రథం లాగినా ఇంచుకూడా కదల లేదు. సాలబేగ్ రథం దగ్గరకు వచ్చి.. జగన్నాథుడి కన్నులారా దర్శించుకుని.. స్వామివారిని కీర్తించాడు. రథానికి తోవ ఇస్తూ పక్కకు జరిగాడు. అప్పుడు రథం కదిలింది.  అప్పుడు సాక్షాత్తు జగన్నాథుడే తన భక్తుడి రాక కోసం నిరీక్షించాడని అర్ధం చేసుకున్న భక్తులు.. స్వామివారిని వేనోళ్ళ జయజయధ్వనాలతో కీర్తించారు.

జగన్నాథుని రథం నిలిచిన చోటనే కూర్చొని సాలబేగ్ .. శ్రీకృష్ణుడు, జగన్నాథుడిని కీర్తిస్తూ… ఒడియా, బెంగాలీ, హిందీ, సంస్కృత భాషల్లో అనేక కీర్తనలు రచించి, గానం చేశాడు. అతని మరణాంతరం సమాధిని పూరీలో జగన్నాథుడి ఆలయం ఉండే బొడొదండొకు చేరువలోనే నిర్మించారు. ఇప్పటికీ తిరుగు రథయాత్రలో జగన్నాథుని రథాన్ని సాలబేగ్ సమాధి ఉన్న ప్రాంతంలో లాంఛనప్రాయంగా కొద్దిసేపు ఆపుతారు. ఈ ఆనవాయితీ శతాబ్దాల నుంచి నేటికీ కొనసాగుతూనే ఉంది. జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు భాగవతోత్తముడైన సాలబేగ్‌ సమాధిని తప్పక దర్శించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..