
పెద్ద కళ్ళు, ముక్కు రింగు, అసంపూర్ణ శరీరం… జగన్నాథుని విగ్రహం చాలా అందంగా , భిన్నంగా కనిపిస్తుంది. పూరి జగన్నాథ ఆలయంలో ఇలాంటి అనేక రహస్యాలు ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఎవరూ వీటిని కనుగొనలేకపోయారు. అదే సమయంలో పూరి ఆలయం గర్భ గుడిలో కొలువైన జగన్నాథుని విగ్రహం కూడా ఈ ధామ్ లోని పరిష్కారం కాని రహస్యాలలో ఒకటి. జగన్నాథుని విగ్రహం ఇప్పటికీ అసంపూర్ణంగా ఉంది. హిందూ మతంలో ఇతర దేవుళ్ళు, దేవతల విగ్రహాలు ఉన్నవాటి కంటే జగన్నాథుని రూపం భిన్నంగా ఉంటుంది. ఇలా ఎందుకు డిఫరెంట్ గా ఎందుకు ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు అన్ని విగ్రహాల కంటే జగన్నాథుడు భిన్నంగా ఎందుకు కనిపిస్తాడో తెలుసుకుందాం..
జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా కనిపిస్తుంది. కనుక ఇది అన్ని ఇతర సాంప్రదాయ హిందూ విగ్రహాల కంటే భిన్నంగా ఉంటుంది. జగన్నాథుడు చేతులు, కాళ్ళు లేకుండా దర్శనమిస్తాడు. అంతేకాదు జగన్నాథుని విగ్రహానికి పెద్ద గుండ్రని కళ్ళు ఉంటాయి. ముక్కుకు ఉంగరం ధరిస్తారు. జగన్నాథుని ఈ ప్రత్యేకమైన రూపం వెనుక అనేక పౌరాణిక కథలు, నమ్మకాలు ఉన్నాయి.
జగన్నాథుని అసంపూర్ణ విగ్రహ రహస్యం
హిందూ పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్న రాజు జగన్నాథుని ఆలయాన్ని నిర్మించబోతున్నాడు. ఇంద్రద్యుమ్న రాజు జగన్నాథుని విగ్రహాన్ని తయారు చేసే పనిని ఇంద్ర సభలోని సభ్యులు.. దేవతల శిల్పి విశ్వకర్మకు అప్పగించాడు. అయితే విశ్వకర్మ రాజుకి ఒక షరతు పెట్టాడు. తాను విగ్రహాలను తయారు చేసే సమయంలో .. ఎవరూ తనని పిలవ రాదని, విగ్రహాలు పూర్తి అయ్యే వరకు ఎవరూ ఈ గదిలోకి ప్రవేశించకూడదని.. ఎవరైనా విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు గదిలోకి ప్రవేశిస్తే.. అప్పటి వరకూ ఎంత విగ్రహాలు పూర్తి అయితే… అంత వరకే మలచిన విగ్రహాన్ని.. అంటే విగ్రహాన్ని అసంపూర్ణంగా వదిలివేసి వెళ్లిపోతానని రాజుకి కండిషన్ పెట్టాడు.
రాజు విశ్వకర్మ షరతును అంగీకరించాడు. విగ్రహం తయారీ పని ప్రారంభమైంది. అయితే రాజుకు విగ్రహం ఎలా తయారు చేస్తున్నారో చూడాలనే కోరిక ఉండేది. అటువంటి పరిస్థితిలో రాజు తలుపుకు అవతలి వైపు నిలబడి విగ్రహం తయారు చేస్తున్న శబ్దాన్ని వినేవాడు. ఒకరోజు రాజు లోపలి నుంచి ఎటువంటి శబ్దం వినిపించలేదు. దీంతో విగ్రహాల పని పూర్తయిందని లేదా విశ్వకర్మ పని వదిలి వెళ్ళిపోయాడని అనుకున్నాడు.
అటువంటి పరిస్థితిలో ఉత్సుకత ఆపుకోలేక రాజు గది తలుపు తెరిచాడు. దీనిని చూసిన విశ్వకర్మ కోపంగా అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి జగన్నాథుడు, సోదరుడు బలరాముడు, సుభద్ర విగ్రహం అసంపూర్ణంగానే మిగిలిపోయాయని చెబుతారు. హిందూ మతంలో అసంపూర్ణ విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణించబడుతుంది. అయితే పూరి ధామ్‌లో మాత్రం జగన్నాథ విగ్రహంతో పాటు అన్న బలరాం, చెల్లెలు సుభద్ర లను భక్తితో పూజిస్తారు.
పెద్ద కళ్ళు: జగన్నాథుని పెద్ద కళ్ళు ఆయన సర్వవ్యాప్త స్వభావానికి ప్రతీకగా పరిగణించబడతాయి. ఈ కనులు ప్రతిదీ చూస్తున్నాయని నమ్మకం.
చేతులు, కాళ్ళు లేకపోవడం: నమ్మకాల ప్రకారం జగన్నాథుని విగ్రహం అసంపూర్ణంగా ఉండటం బ్రహ్మ నిరాకార రూపానికి చిహ్నం.
కలప వాడకం: జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలను వేప కలపతో తయారు చేస్తారు. దీనిని ‘దారు బ్రహ్మ’ అని పిలుస్తారు.
విగ్రహల మార్పు: జగన్నాథుని విగ్రహాన్ని నబకళేబర ఆచారం ప్రకారం మారుస్తారు. పాత విగ్రహాలను కొత్త వాటితో భర్తీ చేస్తారు. ఈ ప్రత్యేక ఆచారాన్ని ‘నవకలేబర’ అంటారు. నబకళేబర ఆచారం ప్రతి 12, 14 లేదా 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.