
సనాతన ధర్మంలో పితృపక్షానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది పితృదేవతలను స్మరించుకోవడానికి ఒక ముఖ్యమైన సమయం. ఈ పదిహేను రోజుల కాలంలో వారికి తర్పణం, దానం, పూజలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం పితృపక్షం సెప్టెంబర్ 7న మొదలై సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఇంట్లో పెంచితే పితృదేవతల కృప లభిస్తుంది. అలాగే ఆగిపోయి ఆటంకాలు ఎదురవుతున్న పనులన్నీ వెంటనే పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు..
జ్యోతిష్య నిపుణుల ప్రకారం, పితృపక్షంలో కొన్ని మొక్కలు ఇంట్లో పెంచడం, పూజించడం వల్ల కుటుంబంలో శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. ముఖ్యంగా రావి, మర్రి, తులసి మొక్కలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రావి చెట్టులో పితృదేవతలు ఉంటారు. ఈ సమయంలో రావి చెట్టుకు నీళ్లు పోసి, దీపం వెలిగించడం శుభం. ఈ చెట్టును ఇంట్లో పెంచితే ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
మర్రి చెట్టును దీర్ఘాయువు, మోక్షం ఇచ్చే వృక్షంగా భావిస్తారు. మర్రి మొక్కను ఇంట్లో పెంచితే పితృదేవతలు సంతోషిస్తారు. జీవితంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.
తులసి హిందూ ధర్మంలో పవిత్రమైనది. మరణించినవారి నోటిలో తులసి దళం పెడితే మోక్షం లభిస్తుందని నమ్మకం. పితృపక్షంలో తులసి మొక్కను పెట్టి ప్రతిరోజూ నీళ్లు పోస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోతాయి. పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. తులసి ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరుగుతుంది.
ఈ మొక్కల సంరక్షణ, పూజలతో పాటు పితృ పక్షంలో దానం, తర్పణం చేయడం కూడా చాలా మంచిది. దీనివల్ల పితృదేవతలు సంతోషించి కుటుంబసభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు. పితృపక్షంలో ఈ మొక్కలు పెంచితే ఇంట్లో సానుకూల శక్తి, అదృష్టం పెరుగుతాయి.