Nagoba Jatara: ఆదివాసీల అడుగులన్నీ అటువైపే.. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర..

|

Jan 21, 2023 | 8:15 AM

నిశరాత్రి కూడా అడవంతా ఆనంద తాండవం చేస్తూ వెలుగు నింపుతుంది. అదే అడవిబిడ్డలు అత్యంత పవిత్రంగా జరుపుకునే కేస్లాపూర్ నాగోబా జాతర. మెస్రం వంశీయులు స్వయంగా పునః నిర్మించుకున్న

Nagoba Jatara: ఆదివాసీల అడుగులన్నీ అటువైపే.. వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర..
Nagoba Jatara 2023
Follow us on

నిశరాత్రి కూడా అడవంతా ఆనంద తాండవం చేస్తూ వెలుగు నింపుతుంది. అదే అడవిబిడ్డలు అత్యంత పవిత్రంగా జరుపుకునే కేస్లాపూర్ నాగోబా జాతర. మెస్రం వంశీయులు స్వయంగా పునః నిర్మించుకున్న నాగోబా ఆలయంలో ఈ ఏడాది అత్యంత వైభవంగా పూజలు మొదలు కానున్నాయి. శనివారం నుంచి నాగోబా జాతర మొదలు కానుంది. మెస్రం వంశస్తులు జరిపే ఘన.. జన.. వన.. జాతర నాగోబా. ఒకే చోటుకు.. మూడు రాష్ట్రాల ఆదివాసీలను చేర్చే జాతర నాగోగా. పుష్యమాస అమావాస్య రోజున జాతర మొదలవుతుంది. ఆదివాసీల అద్భుతమైన జాతరకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అడవి బిడ్డల అపురూప జాతర నాగోబా. శనివారం నుంచి అత్యంత ఘనంగా ప్రారంభమవుతాయి. గంగా జలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర.. ఆద్యంతం గిరిజన సంప్రదాయాల నడుమ అత్యంత వైభవంగా జరుగుతుంది. పుష్యమాసపు అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. అడవిబిడ్డల అడ్డా.. ఆదిలాబాద్ లోని కేస్లాపూర్‌లో మాత్రం దేదీప్యమానమైన వెలుగుల మధ్య ఈ జాతర మొదలవుతుంది. చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు.

ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో గోండు గిరిజనుల్లోని మెస్రం వంశస్తులు జరిపే అతి పెద్ద గిరిజన జాతర నాగోబా జాతర. ఈ జాతర ఆదివాసీల ఐక్యతను చాటుతుంది. అప్పటి వరకూ చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉండే ఆదివాసీ, గోండ్, కోలామ్, పరదాస్, మెస్రం వంశీయులంతా ఈ జాతరలో ఒక్కచోటికి చేరుతారు. జాతర కోసం మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ నుంచి వారం రోజుల ముందే బండ్లపై ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ చేరుకుంటారు. ఈ ప్రయాణం కూడా అత్యంత నిష్టతో ప్రకృతితో మమేకమవుతూ సాగుతుంది.

ఇవి కూడా చదవండి

గంగాభిషేకంతో మొదలై.. ప్రజాదర్బార్, బేటింగ్ ల వంటి ప్రధాన ఘట్టాలతో ఈ జాతర జరుగుతుంది.. ఈ రోజు అమావాస్య కావడంతో.. అర్ధరాత్రి పవిత్ర గోదావరీ నదీ జలాల అభిషేకంతో ఈ జాతర మొదలవుతుంది. ఉదయం మర్రి చెట్ల నుంచి పూజ సామాగ్రి సేకరిస్తారు. అక్కడి నుంచి నాగోబా ప్రధాన ఆలయం చేరుకుంటారు మెస్రం వంశీయులు. ఈ పాదయాత్ర చూసేందుకు రెండు కళ్లు చాలవు. అంత అద్భుతంగా సాగుతుంది. ఏడు కావడిలలో నెయ్యి, పుట్టతేనె, బెల్లం, గానుగ నూనె వంటి వస్తువులు ఉంచుకుని.. 125 గ్రామాలు తిరిగి.. కాలి నడకన ప్రయాణిస్తారు. గోదావరి నుంచి తెచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబా ఆలయానికి చేరుకుంటారు. ఆ పై ఆలయంలో మహాపూజ ప్రారంభమవుతుంది. ఉదయం 12 గంటల నుంచి ఏడు గంటల పాటు నిరంతరాయంగా సాగే గంగాభిషేకం అత్యంత రమణీయంగా సాగుతుంది.

రాత్రంతా నాగదైవానికి పవిత్ర పూజలు చేస్తారు మెస్రం వంశీయులు. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల పాటు కోలాహాలంగా ఈ జాతర కొనసాగుతుంది. చివరి రోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులంతా హాజరవుతారు. ఇది ఎన్నికల ఏడాది కావడంతో నాగోబా దర్శనానికి కేంద్ర గిరిజన మంత్రి, రాష్ట్రమంత్రులు సైతం హాజరయ్యే అవకాశముంది. ఈ నెల ఇరవై ఎనిమిది వరకూ ఈ జాతర కొనసాగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..