
ప్రయాగ్ రాజ్ క్షేత్రం త్రివేణీ సంగమ క్షేత్రం. ఇక్కడ గంగా, యమునా నదులతో అదృశ్య రూపంలో సరస్వతి నది కలుస్తాయని నమ్మకం. ఇక్కడ పురాణాలకు సంబంధించిన అనేక పురాతన, రహస్య దేవాలయాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రత్యేకమైన, చారిత్రక ఆలయాల్లో ఒకటి నాగ వాసుకి ఆలయం. ఇది దారాగంజ్‌లోని గంగా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం శివుని భక్తుడు.. నాగులకు రాజు వాసుకికి అంకితం చేయబడింది. ఈ ఆలయం అమృతం కోసం సముద్ర మథనానికి సంబంధించిన ఒక పురాణ సంఘటనకు సంబంధించినది.
వాసుకి ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత
నాగ వాసుకి ఆలయానికి సంబంధించిన ప్రస్తావన అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించారు. వీటి ద్వారా ఈ ఆలయం గురించి తెలుసుకోవచ్చు. ఈ ఆలయం శతాబ్దాల పురాతనమైనదని, కాలానుగుణంగా పునరుద్ధరించబడిందని నమ్ముతారు. ఆలయంలో ప్రతిష్టించబడిన వాసుకి నాగ విగ్రహం చాలా ఆకర్షణీయంగా, చూడదగినదిగా ఉంటుంది. ఈ ఆలయం ముఖ్యంగా నాగ పంచమి రోజున భక్తులతో రద్దీగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వాసుకిని పూజించడానికి, అతని నుంచి ఆశీర్వాదం పొందేందుకు ఇక్కడకు వస్తారు. ఇక్కడ పూజించడం వల్ల సర్ప దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని, జాతకంలో కాలసర్ప దోష ప్రభావం కూడా తగ్గుతుందని నమ్ముతారు.
సముద్ర మథనం వాసుకిల మధ్య సంబంధం
నాగ వాసుకి ఆలయం అత్యంత ఆసక్తికరమైన అంశం సముద్ర మంథనంతో ఉన్న సంబంధం. పురాణాల ప్రకారం దేవతలు, అసురులు అమృతం కోసం సముద్రాన్ని చిలికాలని నిర్ణయించుకున్నప్పుడు.. శ్రీ మహా విష్ణువు సూచనల మేరకు మందర పర్వతం కవ్వంగా వాసుకిని తాడుగా ఉపయోగించారు. నాగులకు రాజైన వాసుకి చాలా శక్తివంతమైనవాడు. దీంతో వాసుకి శరీరం మందర పర్వతం చుట్టూ కవ్వంగా చుట్టబడింది. ఇలా వాసుకి ని ఒక వైపు దేవతలు.. మరొక వైపు అసురులు పట్టుకుని కవ్వం చిలకడం ప్రారంభించారు. ఇలా సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతున్న సమయంలో.. వాసుకి శరీరం నుంచి కాల కూట విషం బయటకు వచ్చింది. ఈ విషాన్ని శివుడు మింగి తన కంఠంలో దాచాడు.
అమృతం చిలికే దైవ కార్యంలో వాసుకి ముఖ్యమైన పాత్ర పోషించాడని.. చివరికి అమృతం లభించిందని నమ్ముతారు. సముద్ర మంథనం సమయంలో చిలుకుతున్న సమయంలో వాసుకి శరీరానికి గాయాలయ్యాయి. అప్పుడు వాసుకి విశ్రాంతి కోసం భూమిపై అనేక ప్రదేశాలలో తన నివాసాన్ని నిర్మించుకున్నాడు. నాగ వాసుకి విశ్రాంతి తీసుకున్న పవిత్ర ప్రదేశాలలో ప్రయాగ్‌రాజ్ ఒకటి. ఈ ఆలయం అలా వాసుకి అలసట తీర్చుకున్న స్థలంలో నిర్మించబడిందని నమ్ముతారు.
ఆలయ నిర్మాణం, సందర్శించదగిన ప్రదేశాలు
నాగ వాసుకి ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వాసుకి నాగ విగ్రహంతో పాటు శివపార్వతి దేవి, ఇతర దేవతల విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించబడ్డాయి. ఆలయ గోడలపై పురాణాలు, దేవతల అందమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి భక్తులకు దైవిక అనుభవాన్ని ఇస్తాయి. ఆలయానికి సమీపంలో గంగా నది ఒడ్డు ఉంది. ఈ ఆలయ ప్రాంగణం నుంచి గంగా నది తీరంలోని సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు చూడడం అద్భుతంగా ఉంటాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.