Mini Medaram: మినీ మేడారం జాతరకు సర్వంసిద్ధం, ఎప్పట్నుంచో జరుగుతాయో తెలుసా

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా 24 చోట్ల సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Mini Medaram: మినీ మేడారం జాతరకు సర్వంసిద్ధం, ఎప్పట్నుంచో జరుగుతాయో తెలుసా
Mini Medaram

Updated on: Feb 20, 2024 | 9:34 AM

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారం జాతరకు సమాంతరంగా 24 చోట్ల సమ్మక్క-సారలమ్మ మినీ జాతరలకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని గోలివాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ గ్రామం, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చిల్వ కుదూర్ గ్రామాల్లో జరిగే జాతరలకు భక్తులు భారీగా తరలివస్తారు.

ఈ జిల్లాల కలెక్టర్లు ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సురక్షితమైన తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యాలతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య పనులు చేపట్టనున్నారు. ఈ ఆలయాల వద్ద వృద్ధులు, వికలాంగులు, గర్భిణుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి. ఆయా ఆలయాల చుట్టూ సీసీ రోడ్లు వేయడం, లైటింగ్ ఏర్పాట్లు చేయడం, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్ స్థలాలను అధికారులు ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మందులతో పాటు వైద్యులు, ఇతర సిబ్బందితో తాత్కాలిక వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు ఉంటాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించి పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేసింది.

ఇక వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి.