Medaram Maha Jatara 2022: మేడారం జాతరలో మొక్కబడులే ప్రత్యేకం, మరెక్కడా కనిపించని వైనం!
మేడారం జాతరలో మొక్కుబడులు కూడా స్పెషలే. ఇటువంటి మొక్కుబడులు చాలావరకు మరెక్కడా కనిపించవు. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కుబడులే ప్రధాన భూమిక పోషిస్తాయి. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో మూడో రోజు మొక్కుబడులు చెల్లించడానికి లక్షలాదిమంది భక్తులు వస్తారు.
Medaram Maha Jatara 2022: మేడారం జాతరలో మొక్కుబడులు కూడా స్పెషలే. ఇటువంటి మొక్కుబడులు చాలావరకు మరెక్కడా కనిపించవు. సమ్మక్క సారలమ్మల జాతరలో మొక్కుబడులే ప్రధాన భూమిక పోషిస్తాయి. అమ్మవార్లు ఇద్దరూ గద్దెకు చేరుకున్న తర్వాత జాతర పర్వంలో మూడో రోజు మొక్కుబడులు చెల్లించడానికి లక్షలాదిమంది భక్తులు వస్తారు. ఈ ఒక్కరోజే సమ్మక్క జాతరకు 50 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారుల అంచనా. సమ్మక్క- సారలమ్మల వీరత్వానికి ఎదురుకోళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీసుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో ఆహ్వానం పలుకుతారు.. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనసారా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని వేడుకుంటారు.
జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకోళ్ల సందడే కన్పిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకుని ఆరగిస్తారు. ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కన్పిస్తుంది.. తమ దగ్గరకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని..కానుకలు వేయాల్సిన అవసరంలేదన్నది ఆ తల్లుల మనోభీష్టం… అందుకే చౌకగా ఉండే బెల్లం మొక్కులను ఇష్టపడతారని ఆదివాసీలంటారు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మేడారం జాతర సమయంలో బెల్లం గిరాకీ భలేగా ఉంటుంది.
గద్దెల వద్ద టన్నుల కొద్దీ బంగారం పేరుకుపోతుంది. జంపన్నవాగుల్లో అబ్బియా.. నా తల్లీ సమ్మక్కా అబ్బియా అంటూ శివసత్తుల పూనకాలు..పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకుని చేసే హంగామా భక్తులను సంబరానికి గురిచేస్తుంది. ఆడవారే కాదు..మగవారు కూడా శివాలు ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతీ జాతరకు వస్తారు. వీరంతా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించిన తదుపరి పసుపుతో అలంకరించుకుంటారు. వీరకోలాను చేతబట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు.. భక్తి భావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి.
భక్తులు సమ్మక్క-సారలమ్మ తల్లులను ఆడపడుచులుగా భావించి ఒడి బియ్యం మొక్కులు చెల్లిస్తారు. అయిదు సోళ్ల బియ్యంలో పసుపు-కుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. దర్శనమయ్యాక తల్లులకు ఈ బియ్యం సమర్పిస్తారు. సంతానం లేని భక్తులు జంపన్నవాగులో స్నానమాడి కన్నెపల్లి సారలమ్మ గుడి దగ్గర వరం పట్టి, ముడుపులు కడతారు. వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుకుంటారు. పూజారులు వీరిపై నుంచి దాటుతూ వెళతారు. నాలుగురోజుల జాతర పర్వంలో అమ్మల దర్శనానికి వచ్చే భక్తులు జంపన్నవాగులో జలకాలాడి.. చిలుకలగుట్టనుంచి కుంకుమభరిణె రూపంలో వచ్చే సమ్మక్కను, కన్నెపల్లి నుంచి గద్దెలకు చేరుకునే సారలమ్మను తన్మయంగా దర్శించుకుంటారు. బండారిని గుండెకత్తుకుని అనంత భక్తిభావంతో పరవశించిపోతారు.
Read Also…