Medaram Jathara 2022: నేటితో ముగియనున్న మేడారం జాతర.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్..

| Edited By: Anil kumar poka

Feb 19, 2022 | 12:33 PM

Medaram Jathara 2022: నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది.

Medaram Jathara 2022: నేటితో ముగియనున్న మేడారం జాతర.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్..
Medaram
Follow us on

Medaram Jathara 2022: నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగిన మేడారం మహా జాతర నేటితో ముగియనుంది. ఇవాళ సాయంత్రం వన దేవతలైన సమక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశం చేయనున్నారు. సమ్మక్కను చిలుకల గుట్టకు, సారాలమ్మను కన్నేపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజు ను పూనుగొండ్లకు సాగనంపనున్నారు ఆదివాసీ పూజారులు. మంత్రులు మొదలుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడే ఉండి మేడారం మహాజాతరకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా పటిష్టం చర్యలు తీసుకున్నారు. స్థానిక మంత్రి సత్యవతి రాథోడ్‌కు పితృ వియోగం వల్ల జాతరలో పాల్గొనలేకపోయారు. దాంతో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నీ తానై జాతర సక్సెస్‌కు కారణమయ్యారు. ఇక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులు, ఈ నాలుగు రోజులు అమ్మవార్లను దర్శించుకున్న భక్త జనమంతా కలిపి ఇప్పటి వరకు కోటి మందికిపైగా దర్శనాలు చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలీసు అధికారుల అత్యుత్సాహం..
జాతరపై అనుభవం లేని పోలీస్ అధికారులు, నూతనంగా విధులు నిర్వహిస్తున్న IPS అధికారుల అత్యుత్సాహంతో భక్తులు, పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త ఐపీఎస్ అధికారుల ఓవర్ యాక్షన్‌పై స్థానిక ఆదివాసీలు, పోలీస్ సిబ్బంది మండిపడ్డారు.

వెల్లివిరిసిన ఆధ్యాత్మికత..
మేడారంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. వన దేవతల నామస్మరణతో మేడారం మార్మోగుతోంది. అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కలు చెల్లించుకుంటూ తన్మయత్వానికి గురవుతున్నారు భక్తులు. ముఖ్యంగా మేడారంలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతమయ్యాక భక్తుల తాకిడి మరింత పెరిగింది. సమ్మక్క తల్లి గద్దెను చేరాక సాధారణ భక్తులతో పాటు వీఐపీలు దర్శనానికి క్యూకట్టారు. వరాలు ఇచ్చే తల్లులు వనదేవతలు అంటూ ఉత్సాహంగా దర్శనానికి వస్తున్నారు భక్తులు. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ జనజాతర వైభవోపేతంగా జరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారులను కోటి మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్లకోసారి ఇద్దరు అమ్మవారులు గద్దెలపై రెండురోజుల పాటు కొలువై ఉండడంతో దర్శించుకునేందుకు పోటెత్తారు భక్తులు. భక్తుల రద్దీతో మేడారం జనసంద్రంగా మారి మహానగరాన్ని తలపిస్తుంది. చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించినప్పటి నుంచి, నిరంతరాయంగా దర్శనాలు కొనసాగుతున్నాయి. బారులు తీరి అమ్మవారులకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. గద్దెలపై ప్రాంగణంలో జలప్రవాహంలా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

భక్తుల రద్దీతో సీఎం కేసీఆర్ మేడారం టూర్ రద్దయింది. వనదేవతల జనజాతరకు వీఐపీల తాకిడి కూడా పెరిగింది. సీఎం రాకపోయినప్పటికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు పలువురు సమ్మక్క సారలమ్మ దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అమ్మవారులకు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. అయితే, వీఐపీల తాకిడి, భక్తుల రద్దీతో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. కొన్ని సందర్భాల్లో కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పింగా మారింది. జనంలోకి వచ్చిన వనదేవతలు, మళ్లీ వనంలోకి వెళ్లేవరకు రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

Also read:

APVVP Kadapa Jobs: రాత పరీక్షలేకుండానే.. కడప జిల్లాలో 117 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..రూ.52వేల జీతం..

Energy Drinks: యాక్టివ్‌గా ఉండాలంటే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగాల్సిందే.. ఇంట్లోనే ఈజీగా తయారు చేయండిలా..

నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌ స్ఫూర్తితో కిడ్నాప్ లు.. భార్య కొనిచ్చిన కారుతో అక్రమాలు.. చివరికి..?