Matru Gaya: తల్లికి మాత్రమే శ్రాద్ధ కర్మలు చేసే అరుదైన పవిత్ర క్షేత్రం.. ఎక్కడ ఉందో తెలుసా..?

Matru Gaya Kshetra: సాధారణంగా తండ్రి వంశానికి సంబంధించిన పితృ శ్రద్ధల గురించి ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే తల్లి, తల్లి వంశ పూర్వీకులకు ప్రత్యేకంగా శ్రద్ధ నిర్వహించే అరుదైన పవిత్ర స్థలం కూడా ఉంది. అదే గుజరాత్ రాష్ట్రంలోని సిధ్‌పూర్ పట్టణం, ఇది ‘‘మాతృ గయ’ గా ప్రసిద్ధి చెందింది.

Matru Gaya: తల్లికి మాత్రమే శ్రాద్ధ కర్మలు చేసే అరుదైన పవిత్ర క్షేత్రం.. ఎక్కడ ఉందో తెలుసా..?
Matru Gaya

Updated on: Feb 01, 2026 | 5:44 PM

మన పూర్వీకులకు మతపరమైన విధులతో నివాళులర్పించే రోజును శ్రాద్ధాలుగా పిలుస్తారు. ధర్మశాస్త్రాల్లో శ్రాద్ధాలకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. “ఒక వ్యక్తికి తన పూర్వీకులకు నివాళులర్పించడం కంటే మించిన పుణ్యకార్యం మరొకటి లేదు” అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. సాధారణంగా తండ్రి వంశానికి సంబంధించిన పితృ శ్రద్ధల గురించి ఎక్కువగా వినిపిస్తుంటుంది. అయితే తల్లి, తల్లి వంశ పూర్వీకులకు ప్రత్యేకంగా శ్రద్ధ నిర్వహించే అరుదైన పవిత్ర స్థలం కూడా ఉంది. అదే గుజరాత్ రాష్ట్రంలోని సిధ్‌పూర్ పట్టణం, ఇది ‘‘మాతృ గయ’ గా ప్రసిద్ధి చెందింది.

గుజరాత్‌లోని మాతృ గయ విశిష్టత

పురాణాల ప్రకారం, సిధ్‌పూర్ పట్టణం వద్ద గంగా, సరస్వతి నదులు సంగమిస్తాయని విశ్వాసం. ఈ ప్రాంతంలో ఉన్న బిందు సరోవర్ ఎంతో ప్రసిద్ధి గాంచిన పవిత్ర సరస్సు. అందమైన శిల్పాలు, విశాలమైన మెట్లు ఈ చెరువుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చెరువు ఒడ్డున దేవహూతి తపస్సు చేసిందని పురాణ గాథలు చెబుతున్నాయి. చెరువు చుట్టూ కపిలుడు, దేవహూతి, గరుడుడితో కూడిన బిందు మాధవుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇక్కడ పెద్ద గోశాల కూడా ఉంది.

ఋగ్వేదంలో ప్రస్తావన, పురాణ గాథలు

సిధ్‌పూర్ గ్రామాన్ని ఋగ్వేదంలో ‘దాసు’ అనే పేరుతో ప్రస్తావించినట్లు చెబుతారు. ఆలయ చరిత్ర ప్రకారం, గొప్ప సన్యాసి శ్రీ కపిలదేవుడు తన తల్లికి మోక్షం కలగాలని శ్రద్ధాంజలి ఘటించేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడని విశ్వాసం. అలాగే, తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లి శిరచ్ఛేదం చేసినందుకు తీవ్ర పశ్చాత్తాపంతో బాధపడిన పరశురాముడు.. తన తల్లికి పిండప్రదానం చేసి మోక్షం కలిగించేందుకు ఇక్కడికి వచ్చాడని పురాణ కథనాలు పేర్కొంటాయి.

తల్లికి మాత్రమే శ్రాద్ధం… 24 పిండాల ప్రత్యేక సంప్రదాయం

ఈ గాథల నేపథ్యంలోనే సిధ్‌పూర్‌ను ‘మాతృ గయ’గా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే.. తల్లికి మాత్రమే తిథి, శ్రాద్ధం నిర్వహించే సంప్రదాయం. తల్లితో ఎవరినీ పోల్చలేమన్న భావనతో.. ఈ క్షేత్రంలో తల్లికి మాత్రమే 24 పిండాలను సమర్పించే విధానం అమల్లో ఉంది.
వారణాసి సమీపంలోని గయను పితృ గయగా పిలిస్తే.. సిధ్‌పూర్‌ను మాతృ గయగా వ్యవహరిస్తారు.

కపిలుడు – దేవహూతి కథ

పురాణాల ప్రకారం.. గంధర్వ మహర్షి, అతని భార్య దేవహూతి ఈ పుణ్యభూమిలో నివసించారు. వారికి ఏడుగురు కుమార్తెలు ఉండగా, వారు సప్తఋషులు.. వశిష్ఠ, గౌతమ, జమదగ్ని, భరద్వాజ, కశ్యప, విశ్వామిత్ర, అత్రిలను వివాహం చేసుకున్నారు.

దీర్ఘకాలం కుమారుడి కోసం తపస్సు చేసిన గంధర్వ మహర్షికి, మహావిష్ణువు స్వయంగా కపిలుడిగా జన్మించాడని విశ్వాసం. అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ ధర్మబోధ చేసిన కపిలుడు.. చివరకు తన తల్లి మోక్షానికి మార్గాన్ని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. బిందు సరోవర్‌లో దేవహూతి మోక్షం పొందిన తరువాతే ఈ స్థలం మాతృ గయగా ప్రసిద్ధి చెందింది.

నేటికీ కొనసాగుతున్న సంప్రదాయం

నేటికీ దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు సిధ్‌పూర్‌కు వచ్చి తమ మాతృమూర్తులకు శ్రద్ధాం నిర్వహించడం విశేషంగా భావిస్తారు. తల్లి ఋణాన్ని తీర్చుకునే పవిత్ర స్థలంగా మాతృ గయ ప్రత్యేక గుర్తింపు పొందింది.