మన భారతదేశంలో శివాలయం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి రోజూ నిత్య పూజలు, అభిషేకాలతో పరమశివుడు పరవశించిపోతాడు. ఆలయానికి వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు చేయించి, స్వామిని దర్శించుకుని తరించిపోతారు. అలా ఏడాదంతా ఆలయం తెరిచే ఉంటుంది. కానీ, మనం చెప్పుకోబోయే శివాలయం మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే.. ఈ ఆలయం ఏడాదికి ఒక్క రోజు మాత్రం తెరుచుకుంటుంది. ఆ ఒక్క రోజు మాత్రమే ఆలయంలోని శివుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. మరి ఈ ప్రత్యేకమై శివాలయం ఎక్కడ ఉంది? ఏ రోజున ఆలయాన్ని తెరుస్తారు? ఆసక్తికర వివరాలు మీకోసం..
ఈ ప్రత్యేకమైన పురాతన శివాలయం అక్కడెక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో కొలువై ఉంది కేదారేశ్వర స్వామి ఆలయం. మహా శివరాత్రి రోజున మాత్రమే తలుపులు తెరుచుకునే ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది. అందుకే ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. శివరాత్రి పర్వదినాన.. స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. అతి ప్రాచీనమైన కేదారేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. అభిషేక ప్రియుడైన ఆదిదేవుడికి శివరాత్రి పర్వదినాన అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఏడాదికి ఒక రోజుమాత్రమే ఆలయం తెరుచుకుని ఉండటంతో.. భక్తులు భారీగా పోటెత్తుతారు. ఆ రోజు రాత్రి అంతా ఆలయ పరిసరాల్లోనే ఉండి శివనామ స్మరణ చేస్తారు. ఇలా శివనామ స్మరణలతో ఆలయం మారుమోగిపోతుంది.
తూర్పు చాళుక్యుల కాలంలో బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి గ్రామంలోని నలుదిక్కుల నాలుగు శివాలయాలు నిర్మించారు. వాటిలో ఒకటైన ఒకటైన ఆలయం కేదారేశ్వరాలయం. ఆనాడు జరిగిన యుద్ధాలలో ఈ ఆలయంలోని శివలింగం ధ్వంసం కావడంతో ఆలయం మూత పడింది. శివలింగం ధ్వంసం కావడం అరిష్టంగా భావించి, ఆలయాన్ని మూసివేశారు. అలా నాటి నుంచి ఈ ఆలయాన్ని సంవత్సరానికి ఒక రోజు మహాశివరాత్రి రోజున మాత్రమే తిరిగి తెరుస్తున్నారు. శివరాత్రి పర్వదినాన భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..