వేములవాడలో శివరాత్రి శోభ.. శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు
మహా శివరాత్రి(Shivarathri Celebrations) సంబరాలకు ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా...
మహా శివరాత్రి(Shivarathri Celebrations) సంబరాలకు ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు సుమారు 2 లక్షల మంది భక్తులు(Devotees) వస్తారని అంచనా వేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు. జాతరకు 770 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. తిప్పాపూర్ నుంచి కట్ట బస్టాప్ వరకు 14 ఉచిత బస్సులను నడపనున్నారు. విద్యుద్దీపకాంతులతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించనున్నారు. గుడి చెరువులో శివార్చన కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు తాగు నీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
శివరాత్రి సంబరాల నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, స్థానిక నాంపల్లి గుట్టపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని కూడళ్లలోనూ కెమెరాలు అమర్చారు. వీటన్నింటిని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. జాతరలో బందోబస్తు నిర్వహించేందుకు 1500 మంది పోలీసులను నియమించారు. ఒక అడిషినల్ ఎస్పీ, 8 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 139 మంది ఎస్సైలు, 250 మంది హెచ్‌సీలు, మరో 500 మంది పోలీసులు నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య సమస్య రాకుండా భారీగా సిబ్బంది పనిచేయనున్నారు. భక్తుల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇవి 12 గంటలు, 24 గంటలు సేవలందించేలా రూపొందించారు.
Also Read
మైనర్ పై లైంగిక వేధింపుల కేసు.. కోర్టు సంచలన తీర్పు.. శిక్ష పాటించాల్సిందేనని వ్యాఖ్య