Vinayaka Chavithi: హైటెక్ బొజ్జ గణపయ్య.. ఫోన్‌లో భక్తుల చింతలు విని చింతలు తీర్చే చింతామణి గణేష్..

మన దేశంలో అనేక గణపతి దేవాలయాలు.. వాటికీ సంబంధిచిన అనేక నమ్మకాలు ఉన్నాయి. అయితే ఒక గణపతి ఆలయం వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న గణపయ్యకు భక్తులు ఫోన్ చేసి తమ బాధని కష్టాలను ఆయనతో పంచుకుంటారు. అవును మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లోని చింతామణి గణేష్ ఆలయంలో ఉన్న స్వామితో భక్తులు ఫోన్‌ చేసి మాట్లాడవచ్చు.

Vinayaka Chavithi: హైటెక్ బొజ్జ గణపయ్య.. ఫోన్‌లో భక్తుల చింతలు విని చింతలు తీర్చే చింతామణి గణేష్..
Chintaman Ganesh In Indore

Updated on: Aug 21, 2025 | 5:25 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఎక్కువగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి చింతామణి గణేష ఆలయం. ఈ పుణ్యక్షేత్రం 11 – 12 శతాబ్దాల నాటి జలప్రళయానికి ముందని నమ్మకం. ఈ పురాతన ఆలయం మధ్యప్రదేశ్ (మాల్వా)లోని పరమారాస్ పాలనలో నిర్మించబడిందని నమ్ముతారు. చింతామణి గణేష్ మందిరం పూర్తిగా రాతితో నిర్మించబడింది. ఆలయ నిర్మాణ శైలిని రూపాన్ని చూస్తే అది చరిత్రపూర్వ కాలానికి చెందినదని సూచిస్తుంది. అయినప్పటికీ ఈ ఆలయం దాని ఆకర్షణను నేటికీ కోల్పోలేదు. ఈ ఆలయం హిందూ విశ్వాసాల ప్రకారం విఘ్నాధిపతి గణేశుడికి అంకితం చేయబడింది. పురాతన కాలం నుంచి ఇక్కడ భగవంతుడిని ‘చింతాహరన్’ అని పిలుస్తారు. అంటే అన్ని చింతలు,ఉద్రిక్తతలను తొలగించేవాడు అని అర్థం.

ఫోన్ చేసే సంప్రదాయం ఎలా మొదలైంది
చింతామణి ఆలయం లో కొలువైన గణేశుడు తన భక్తుల మాట విని సహాయం చేస్తాడని ప్రసిద్ధి చెందాడు. చారిత్రాత్మకంగా భక్తులు తమ సంకల్పం, లక్ష్యాలను పంచుకుంటూ భగవంతుడికి చేతితో రాసిన లేఖలను పంపేవారు. ప్రభువు వాటిని నెరవేరుస్తాడని నమ్మకం.

కాలం గడిచేకొద్దీ కమ్యూనికేషన్ విధానం మారిపోయింది. జర్మనీలో విదేశాల్లో స్థిరపడిన చింతామణి గణేష భక్తుడు ఒకడు ఉండేవాడు. విదేశాల్లో స్థిరపడే ముందు ప్రతిరోజూ ఆయన ఆలయాన్ని సందర్శించేవాడు. విదేశాల్లో స్థిరపడిన తర్వాత ఆయనకి ఒకసారి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన చింతామణి ఆలయ పూజారికి ఫోన్ చేసి చింతామణి ప్రభువుతో తన కష్టాన్ని చెప్పుకుంటానని అభ్యర్థన చేశాడు.

ఇవి కూడా చదవండి

భక్తుని భక్తి , భగవంతుడి పట్ల ఉన్న నమ్మకాన్ని గౌరవిస్తూ పండితుడు తన ఫోన్‌ను గణపతి చెవి దగ్గర ఉంచాడు. భక్తుడు తన సమస్యలన్నింటినీ బప్పాతో చెప్పుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి.. మళ్ళీ ఆలయ పూజారీకి ఆ భక్తుడి నుండి కాల్ వచ్చింది. చింతామణి గణేష్ తన కోరికను నెరవేర్చాడని చెప్పాడు. తాను ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయట పడినట్లు చెప్పాడు. ఈ విషయం బయటకు వచ్చింది. అప్పటి నుంచి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు చింతామణి గణేష్‌తో ఫోన్ చేసి మాట్లాడడం ప్రారంభించారు.

చింతామణి ఆలయం
చింతామణి గణేష్ ఆలయాన్ని 12వ శతాబ్దంలో పర్మార్ రాజవంశ రాజులు నిర్మించారు. ఇది నాగర శైలి నిర్మాణం. ఆలయ శిఖరాలు లేదా మధ్య గోపురం ఆకాశం వైపు నేరుగా ఉంటుంది. గణపతి ఆలయంలోని గర్భగుడిలో ఉన్నాడు. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయంలో అందమైన స్తంభాలు సంక్లిష్టమైన డిజైన్లతో మలచారు. ఆలయంలో గర్భగుడికి అనుసంధానించబడిన ఒక భారీ మంటపం లేదా హాలు ఉంది. ఈ హాల్ సాయంత్రం హారతి ఇచ్చే సమయంలో భారీ జనసమూహంతో నిండిపోతుంది.

విగ్రహం లేదా గణేశుడి ప్రతిమ స్వయంభు. ఆ విగ్రహం నేల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. సిద్ధి బుద్ధిలతో కలిసి పూజలను అందుకుంటున్నాడు. చింతామణి అనేది ఒక తత్వవేత్త రాయి, లేదా ఒక మాయా రత్నం. ఇది అన్ని కోరికలను నిజం చేసే శక్తిని కలిగి ఉంటుంది. భక్తుల కోరికలను తీర్చే దేవుడిని కూడా అదే పేరుతో పిలుస్తారు.

చింతలన్నింటినీ తొలగించేవాడు కనుక హిందువులు తమ పిల్లల వివాహ తేదీ నిర్ణయించబడినప్పుడు.. బంధువులు మరియు స్నేహితులను ఆహ్వానించడానికి వివాహ ఆహ్వాన పత్రాలను ముద్రిస్తారు. పెళ్ళిలో, పెళ్లైన తర్వాత జంట ఎదుర్కొనే ఏవైనా అడ్డంకులను తొలగింమని కోరుకుంటూ మొదటి ఆహ్వాన పత్రికను చింతామణి గణేష్‌కు అందిస్తారు.

చాలా మంది భక్తులు పూజ కోసం తమ కొత్త వాహనాలను ఆలయ సముదాయానికి తీసుకువస్తారు. ఈ ఆలయంలో పూజ పూర్తయిన తర్వాత వాహనానికి ఎటువంటి అడ్డంకులు ఉండవని వారు నమ్ముతారు. గణేష్ తమను కాపాడుతాడని, తమ వాహనం ముందు ఏవైనా అడ్డంకులు కలిగితే వాటిని తొలగిస్తాడని నమ్ముతారు. ఈ ఆలయంలోకి వెళ్ళే భక్తుడు తనతో పూజ పళ్ళెం తీసుకుని వెళ్ళడం మరచిపోతాడెమో కానీ సెల్‌ఫోన్‌ను తీసుకుని వెళ్ళడం ఎప్పటికీ మర్చిపోడు.

పండితుడి వద్ద ఒక ప్రత్యేక ఫోన్ లైన్ ఉంటుంది. నగరం వెలుపల, దేశం వెలుపల స్థిరపడిన చాలా మంది భక్తులు పూజారికి కాల్ చేస్తారు. ఈ ఫోన్ ను భగవంతుని చెవి వద్ద ఉంచుతాడు. భక్తుడు తన సమస్యలను దేవునికి చెబుతాడు. చాలా మందికి ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు. అయినప్పటికీ భక్తులను అడిగితే.. తాము చెప్పిన సమస్యని ఎలా దేవుడు విన్నాడు.. తమ కోరికలను ఎలా తీర్చాడో కథలు కథలుగా చెబుతారు.

ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి?

మధ్యప్రదేశ్‌లోని ఎక్కడి నుండైనా ప్రైవేట్ టాక్సీలను అద్దెకు తీసుకొని చింతామణి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. అయితే ఇండోర్, భోపాల్ నుంచి అందుబాటులో ఉన్న సాధారణ బస్సులను తీసుకోవచ్చు. చింతామణి గణేష్ ఆలయం ఉజ్జయిని-ఫతేబాద్ రైల్వే మార్గంలో ఉంది. ఇది ఉజ్జయిని నగరానికి నైరుతి మూలలో ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.