
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో.. జగన్నాథుని రథయాత్ర ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా లక్షలాది మంది పూరీ క్షేత్రానికి చేరుకుంటారు. ఇప్పటికే జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం జగన్నాథ రథయాత్ర 2025 జూన్ 27 నుంచి ప్రారంభం కానుంది. ఈ జగన్నాథ రథయాత్రను పూరీ క్షేత్రంలో 9 రోజులు జరుపుకుంటారు.
హిందూ పంచాంగం ప్రకారం జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండవ రోజు నుంచి ప్రారంభమవుతుంది. విదేశాల నుంచి కూడా కృష్ణ భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనడానికి వస్తారు. అయితే పూరీలో జగన్నాథ రథయాత్ర జరిగినట్లే.. దేశంలోని అనేక ప్రాంతాలలో జరుగుతుంది ఆ ప్రదేశాలు ఏమిటంటే..
జగన్నాథ రథయాత్ర ఎక్కడ జరుగుతుంది?
కాశీలో రథయాత్ర: ప్రపంచంలోనే పురాతన ఆధ్యాత్మిక నగరమైన కాశీలో జగన్నాథుని రథయాత్రని నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కాశీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ రథయాత్రలో పాల్గొంటారు. వేలాది మంది భక్తులు డప్పుల చప్పుళ్ళ మధ్య జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు. దీనితో పాటు ఉత్తర్ ప్రదేశ్లోని కాన్పూర్‌లో కూడా జగన్నాథుని రథయాత్ర కూడా జరుగుతుంది.
బృందావనంలో రథయాత్ర: శ్రీ కృష్ణుడి బాల్యం గడిపిన బృందావనంలో కూడా జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది. ఇక్కడి నివాసితులు ఏడాది పొడవునా ఈ రథయాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. పూరీ తరహాలోనే ఇక్కడ కూడా వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో పాల్గొనేందుకు.. జగన్నాథుని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తారు.
మధ్యప్రదేశ్‌లో రథయాత్ర: పూరీతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ భక్తులు ఉన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో కూడా జగన్నాథుని రథయాత్ర ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. దీనితో పాటు అమృత్‌సర్‌లలో కూడా జగన్నాథుని రథయాత్ర చాలా వైభవంగా జరుగుతుంది.
రాంచీలో జగన్నాథ రథయాత్ర: పూరీ లాగే జగన్నాథుని రథయాత్ర కూడా రాంచీలో జరుగుతుంది. ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఇక్కడ కూడా పూరీ లాగే భారీ సంఖ్యలో ప్రజలు రథయాత్రలో పాల్గొంటారు. డప్పులు, సన్నాయి వాయిద్యాల నడుమ జగన్నాథుడు రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తాడు.
ఢిల్లీ జగన్నాథలో రథయాత్ర: ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర జరిగినట్లే ప్రతి సంవత్సరం ఢిల్లీలోని జగన్నాథ ఆలయంలో అందమైన రథయాత్ర జరుగుతుంది. హౌజ్ ఖాస్‌లో ఉన్న ఈ జగన్నాథ ఆలయం కూడా జగన్నాథుని ఊరేగింపును ఘనంగా నిర్వహించే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. జగన్నాథ యాత్ర సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.
హైదరాబాద్ లో జగన్నాథ రథయాత్ర: పూరీ తరహాలోనే బంజారాహిల్స్ లో జగన్నాథ ఆలయం ఉంది. ఇక్కడ కూడా జగన్నాథ స్వామి రథయాత్రని నిర్వహిస్తారు. జగన్నాథుడికి, సుభద్రాదేవికి, భలభద్రుడికి మూడు రథాలు అలంకరించి ఊరేగిస్తారు. ఈ రధోత్సవం జరిగే పది రోజులు ఆలయంలో స్వామివారి ఉండరు.. సమీపంలో ఉన్నకనకదుర్గా దేవి ఆలయంలో ఉంటారు. పది రోజుల అనంతరం వేడుకగా తిరిగి జగన్నాథుడు తన అన్న, చెల్లెలతో కలిసి ఆలయంలోని గర్భ గుడిలోకి చేరుకుంటారు. పూరీ తరహ సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు