Magha Purnima 2021: తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంఘమం అద్భుత ఘట్టానికి నెలవైంది. ఇవాళ మాఘపూర్ణిమను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో స్వామి వారికి పుణ్యస్నానం చేయించారు. దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది, ప్రాణహిత నది, అంతర్లీనంగా సరస్వతి నదుల సంగమ స్థానమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో శనివారం నాడు మాఘపూర్ణిమ కార్యక్రమం నిర్వహించారు.
ఈ మహోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో.. ఉదయం శ్రీదేవి, భూదేవీ సమేత మలయప్ప స్వామిని కొలువుదీర్చి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన చేశారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రస్నానం కార్యక్రమం నిర్వహించారు. కన్నులపండువగా జరిగిన ఈ మాఘపూర్ణిమ పుణ్యస్నాన కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, టీటీడీ అధికారులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Also read:
మాఘపూర్ణిమ సందర్భంగా గోవుకు శ్రీమంతం..108 మంది ముత్తైదువులతో ఘనంగా.. ఎంత గొప్ప సంస్కారం