Astrology: బంగారం పోగొట్టుకున్నారా?.. రానున్న రోజుల్లో మీ జీవితంలో జరిగేది ఇదే..
బంగారం అంటే చాలు, మనసులో ఏదో తెలియని ఆనందం. పెట్టుబడికే కాదు, శుభకార్యాల్లోనూ, అలంకరణలోనూ బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, అప్పుడప్పుడు దారిన పోతూ బంగారం దొరకడం, లేదా మన బంగారం పోగొట్టుకోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు ఇది అదృష్టమా లేక దురదృష్టమా అని చాలామందికి సందేహం వస్తుంది. దీని వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారతీయుల జీవితంలో బంగారం ఒక ముఖ్యమైన భాగం. పెట్టుబడి, సెంటిమెంట్, హోదా ఇలా.. చాలా అంశాలతో బంగారం ముడిపడి ఉంటుంది. హిందూ ధర్మంలో బంగారాన్ని పవిత్రమైన, విలువైన లోహంగా భావిస్తారు. ఇది సంపదకు అధిదేవత అయిన లక్ష్మీ దేవితో ముడిపడి ఉంటుందని నమ్ముతారు.
మనం నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరో పోగొట్టుకున్న బంగారం కనిపిస్తే ఏం చేయాలి? దాన్ని తీసుకోవచ్చా? ఇది మంచి సంకేతమా లేదా చెడు సంకేతమా? ఈ ప్రశ్నలకు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.
బంగారం పోతే..
ఎవరైనా బంగారం పోగొట్టుకుంటే, అది వారి జాతకంలో కేతువు, శని, రాహువు అనే మూడు గ్రహాల చెడు ప్రభావం కారణంగా జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ గ్రహాల చెడు ప్రభావం బంగారం పోగొట్టుకున్న వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బంగారం పోగొట్టుకోవడం దురదృష్టానికి సంకేతం. ఇలా జరిగిన వ్యక్తులు వ్యాధులు, ఆర్థిక నష్టాలు, ఇతర సమస్యలను ఎదుర్కొంటారని అంటారు.
బంగారం దొరికితే..
చాలామంది బంగారం దొరికితే ధనవంతులు అవుతారని నమ్ముతారు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రయాణిస్తున్నప్పుడు లేదా వెళ్తున్న మార్గంలో బంగారం దొరకడం కూడా మంచి సంకేతం కాదు. దొరికిన బంగారం బృహస్పతి, సూర్యుడు అనే రెండు గ్రహాల చెడు ప్రభావం ఉందని అర్థం. ఇది దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. రోడ్డు మీద బంగారం దొరకడం వల్ల కీర్తి, ఆత్మవిశ్వాసం కోల్పోతారు. అలాగే సమాజంలో ప్రతిష్ట, గౌరవం దెబ్బతింటాయి, ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.
బంగారం దొరికితే ఏం చేయాలి?
రోడ్డు మీద బంగారం కనిపిస్తే, దాన్ని ఉంచుకోకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. గురువారం నాడు బ్రాహ్మణుడికి ఇవ్వడం ఉత్తమం. ఇలా చేస్తే గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. బంగారం దొరకడం, పోవడం రెండూ కీర్తి, ఆరోగ్యం, డబ్బును కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి, బంగారం దొరికితే దానిని వదిలించుకోవాలని అంటారు.
గమనిక
ఈ కథనంలో ఇచ్చిన సమాచారం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.




