Ganesh Chaturthi 2022: గణేష్ చతుర్థి పండుగను ఆగస్టు 31న దేశవ్యాప్తంగా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు తమ ఇళ్లలో గణపతి విగ్రహాలను ప్రతిష్టించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో రకరకాల విగ్రహాలను వీధుల్లో, ఇండ్లల్లో ప్రతిష్టిస్తుంటారు. ఇక గణపతి దేయాలయాల్లోనూ ప్రత్యేక అలంకరణలు చేసి, విశిష్ట పూజలు నిర్వహిస్తారు. 9రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భక్తులు పాల్గొంటారు. అయితే, దేశంలో కొన్ని ప్రత్యేక గణపతి దేవాలయాలు ఉన్నాయి. వాటిలో విగ్రహాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దేవభూమి ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ముండ్కతీయ ఆలయాన్ని కూడా ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. కేదార్ లోయ ఒడిలో నెలకొని ఉన్న ఈ ఆలయం దేశంలోనే తలలేని గణేశుడి విగ్రహాన్ని పూజించే ఏకైక ఆలయంగా పేరుగాంచింది.
ముండ్కతీయ అనే పేరు రెండు పదాలతో ఈ ఆలయం ఏర్పడింది. మొదటి పదం ‘ముండ్’ అంటే తల, కాత్య అంటే విచ్ఛేదనం. ముండ్కతీయ దేవాలయం గర్వాల్ డివిజన్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఇది సోన్‌ప్రయాగ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. శివ పురాణం ప్రకారం, శివుడు తన కుమారుడైన గణేశుని తల నరికేస్తాడు. నిజానికి పార్వతి గౌరీ కుండ్‌లో స్నానం చేస్తున్న సమయంలో.. పసుపు ముద్దతో మానవ శరీరాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ తరువాత పార్వతి అతనిని తన కుమారుడిగా స్వీకరిస్తుంది. ఎవరినీ లోపలికి రానివ్వకూడదని కొడుకును పార్వతి ఆదేశిస్తుంది.
త్రియుగి నారాయణ్ టెంపుల్ సమీపంలో, గణేశుడు తన తల్లి పార్వతి ఆదేశాలను అనుసరించి, శివుడిని గదిలోకి అనుమతించడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు తన కొడుకు తల నరికేస్తాడు. గణేశుడు తన కొడుకు అని శివునికి తెలియదు. ఆ తరువాత శివుడు ఏనుగు తలను తెచ్చి, ఆ బాలుడి మొండానికి అతికించి, మరోసారి ప్రాణం పోస్తాడు. దీంతో ఇక్కడి ఆలయాన్ని ముండ్కతీయగా పిలుస్తుంటారు. ఈ ఆలయం త్రియుగి నారాయణ్ ఆలయానికి చాలా సమీపంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే సోన్‌ప్రయాగ్ నుంచి కాలినడకన వెళ్లాలి. లేదా మీరు స్థానిక టాక్సీ ద్వారా కూడా వెళ్ళవచ్చు.
రైలు మార్గంలో వెళ్లాలంటే ఈ ఆలయం డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుంచి 250 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది కాకుండా, డెహ్రాడూన్ నుంచి గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ బస్సులు క్రమం తప్పకుండా నడుస్తాయి.