హైదరాబాద్, సెప్టెంబర్29: గణపతి లడ్డూ.. ఒకప్పుడు సెంటిమెంట్ కానీ ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ. లక్షలు పోసైన ఆ లంబోదరుని లడ్డూ దక్కించుకోవాలని భక్తుల ఆరాటం. బాలాపూర్ లడ్డూ వేలం ఎంతో ఫేమస్. అంతేనా ఇక పెద్ద పెద్ద విల్లాలు, అపార్టుమెంట్లలో ఆ రికార్డులు సైతం చెరిగి కోట్లు పలికింది లడ్డూ ప్రసాదం. పోటాపోటీగా సాగిన లంబోదర లడ్డూ వేలాలు అదరహో అనిపించాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూ ఏకంగా కోటి 26 లక్షల రూపాయలు పలికించి రికార్డుల మోత మోగించింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో అత్యధికర ధర పలికిన లడ్డూగా నిలించింది. విల్లాలోని కమ్యూనిటి అంతా కలిసి కోటి 26 లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డూ భళా.. 450 రూపాయలతో ప్రారంభమైన లడ్డూ వేలం 2023 నాటికి 27 లక్షలకు చేరింది. ఈ ఏడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా.. పోటాపోటిగా సాగిన వేలంలో తుర్కయంజాల్ కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. గతేడాది 24 లక్షల 60 వేలకు పోగా.. ఈ సారి 2 లక్షల 40 వేలు అధికంగా పలికింది. బాలా పూర్ లడ్డూ దక్కించుకోవడం ఇప్పుడు ఓ ప్రెస్టీజ్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపు బాలాపూర్ వైపే ఉండటం, లడ్డు దక్కించుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం భక్తి నుంచి ప్రెస్టీజ్ దాకా వేలం పాట మారిపోయింది.
వీటితో పాటు నగరంలో పలు ప్రాంతాల్లో వేలం పాట లక్షలు పలికింది. నగర శివారు మధురాపురంలో సేవా సమితి గణపతి లడ్డూ 11 లక్షలకు వేలంలో అదే గ్రామానికి చెందిన పర్వత రెడ్డి దక్కించుకున్నారు. పుప్పాలగూడలోని అల్కాపూర్ టౌన్ షిప్ లడ్డూ వేలం 10 లక్షలు పలికింది. ప్రణీత్ కాన్సెప్ట్స్ కు చెందిన సురేష్ గణపతి లడ్డూను 10 లక్షలకు దక్కించుకున్నారు. మణికొండలో నవజ్యోతి యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయకుడి వద్ద లడ్డూ 9 లక్షలకు ఓ భక్తుడు కైవసం చేసుకున్నాడు.
కేపిహెచ్‌బిలోని సర్దార్ పటెల్ నగర్ లో లడ్డూ ప్రసాదం 5 లక్షల వెయ్యి రూపాయలు పలికింది. మణికొండ హుడా కాలనీలో 3 లక్షల 25 వేలకు, మణికొండ లోని SM సాయి హిల్స్ లో 2 లక్షల 55 వేలు, మేడిబావి గణేశ్ ఫ్రెండ్స్ అసోషియేషన్ ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద లడ్డూ 2 లక్షల 45 వేలు పెట్టి భక్తులు దక్కించుకున్నారు. సరూర్ నగర్ లోని రత్నదీపిక అపార్టమెంట్స్ లో 88 వేలకు లడ్డూ ప్రసాదం వేలం పాటలో కైవసం చేసుకున్నారు.
గణేశ్ ఉత్సవాలు ఎంత భక్తిశ్రద్ధలతో జరుపుతారో.. అంతే భక్తితో ఆ లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని భక్తులు భావిస్తుంటారు. గణేశ మండపాల నిర్వాహకులు ఆ లడ్డూ ప్రసాదాన్ని వేలం వేసి ఏ భక్తున్ని వరిస్తోందో చూస్తారు. అలా భక్తి తో ప్రారంభమైన లడ్డూ వేలం పాట.. తర్వాత మంచి జరుగుతుందన్న సెంటిమెంట్ గా మారింది. రానురాను.. నేనే దక్కించుకోవాలి అనేంత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది. గణేశ్ అనగానే గుర్తుకొచ్చే ఖైరతాబాద్ మహాగణపతి వద్ద మాత్రం వేలం పాట నిర్వహించరు. భక్తులకు ఉచితంగా క్యూ లైన్లో పంచిపెడుతుంటారుయ. ఈ ఏడాది 2000 కిలోల భారీ లడ్డూను లంగర్ హౌజ్ కి చెందిన భక్తుడు స్వామికి సమర్పించగా 5వ రోజు నుంచి క్యూ లైన్లో వచ్చిన భక్తులకు ప్రసాదంగా భారీ లడ్డూను పంచారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..