Magh Mela 2026: మాఘ మేళా 2026: ముక్కోటి దేవతల నిలయం.. త్రివేణి సంగమం గురించి ఈ విషయాలు తెలుసా?
భారతీయ సంస్కృతిలో నదులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందునా మూడు పవిత్ర నదుల కలయిక అంటే ఆ పుణ్యఫలం వర్ణనాతీతం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) లో గంగా, యమునా అంతర్వాహిని సరస్వతీ నదులు కలిసే 'త్రివేణి సంగమం' హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ప్రస్తుతం అక్కడ మాఘ మేళా ఘనంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకునేందుకు, మోక్షం పొందేందుకు ఈ పుణ్య క్షేత్రానికి తరలివస్తున్నారు. ఈ పవిత్ర భూమి విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రయాగ్‌రాజ్.. పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడు స్వయంగా యజ్ఞం చేసిన పరమ పవిత్ర భూమి. ఇక్కడి త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంగా నది స్వచ్ఛతకు, యమునా నది భక్తికి, సరస్వతీ నది జ్ఞానానికి చిహ్నాలుగా నిలుస్తాయి. కుంభమేళా, అర్ధ కుంభమేళా మరియు వార్షిక మాఘ మేళా సమయంలో ఈ సంగమం ఒక ఆధ్యాత్మిక సాగరంలా మారుతుంది. త్రివేణి సంగమంతో పాటు ప్రయాగ్‌రాజ్‌లో చూడదగ్గ ఇతర చారిత్రక ప్రదేశాల వివరాలు మీకోసం.
ఆధ్యాత్మిక విశిష్టత: గంగా నది తెల్లటి రంగులో, యమునా నది నీలి రంగులో ప్రవహిస్తూ ఒకచోట కలవడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మూడవ నది అయిన సరస్వతి భూమి లోపలి నుండి ప్రవహిస్తూ అంతర్వాహినిగా ఈ రెండింటిలో కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంగమ తీరంలో పవిత్ర స్నానం ఆచరించడం, అస్థికల నిమజ్జనం చేయడం ద్వారా ఆత్మలకు శాంతి, మోక్షం లభిస్తాయని నమ్ముతారు. సాయంత్రం వేళ జరిగే ‘గంగా హారతి’ భక్తులకు కనువిందు చేస్తుంది.
ప్రయాగ్‌రాజ్‌లో సందర్శించాల్సిన ఇతర ప్రదేశాలు:
అలహాబాద్ కోట: 1583లో అక్బర్ చక్రవర్తి నిర్మించిన ఈ కోట యమునా, గంగా నదుల సంగమ తీరంలో ఉంటుంది. ఇది జాతీయ ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడం.
ఆనంద్ భవన్: నెహ్రూ కుటుంబానికి చెందిన ఈ చారిత్రక భవనం ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చబడింది. చరిత్ర ప్రేమికులకు ఇది మంచి ఎంపిక.
ఖుస్రో బాగ్: మొఘల్ వాస్తుశిల్పానికి ప్రతీకగా నిలిచే అందమైన ఉద్యానవనం. ఇక్కడ ఇసుక రాయితో నిర్మించిన నాలుగు అద్భుత సమాధులు ఉంటాయి.
శ్రీ లలితా దేవి ఆలయం: లలితా దేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం భక్తుల విశేష ప్రాముఖ్యత కలిగినది.
గమనిక : మాఘ మేళా సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి భక్తులు స్థానిక పోలీసు, మేళా అధికారుల సూచనలు పాటించడం అవసరం. నదిలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ సమాచారం కేవలం పర్యాటక ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే.
