Vasanta Panchami 2024
చదువుల తల్లి సరస్వతి దేవికి అంకితం చేయబడిన వసంత పంచమి పండుగ 14 ఫిబ్రవరి 2024న జరుపుకోనున్నారు. ఈ రోజున సరస్వతీ దేవిని అన్ని గృహాలు, పాఠశాలలు మొదలైన వాటిలో పూజిస్తారు. ఈ రోజు విద్యార్థులకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేగాదు కళలను నేర్చుకోవడానికి, చదువులో సక్సెస్ అందుకోవడానికి సరస్వతి దేవి ఆశీర్వాదం పొందడానికి వసంత పంచమి ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున, సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే సరస్వతి దేవి పూజ విషయంలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..
వసంత పంచమి రోజున శారదా దేవిని పూజించడం వల్ల కళ, సంగీతం, విద్యా రంగాలలో విజయం లభిస్తుందని హిందువుల విశ్వాసం. ఈ రోజున సరస్వతీ దేవి దర్శనమిస్తుందని చెబుతారు. అందుకే ఈ రోజును ఆమె పుట్టినరోజుగా కూడా జరుపుకుంటారు. పురాణ గ్రంధాల ప్రకారం వసంత పంచమి రోజున పిల్లలు, విద్యార్థులు తీసుకునే కొన్ని చర్యల కారణంగా సరస్వతీ దేవి ఆశీర్వాదం వారి జీవితాంతం వారికి ఉంటుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.
వసంత పంచమి రోజున పిల్లలకు చేయాల్సిన నివారణ చర్యలు..
- లక్ష్యంపై దృష్టి పెట్టడానికి.. పిల్లల తమ లక్ష్యాన్ని అందుకోవడానికి ఏకాగ్రతతో చదువుకోవడం లేదా.. అప్పుడు సరస్వతి దేవి చిత్రాన్ని స్టడీ టేబుల్ దగ్గర ఉంచండి. ఇలా చేయడం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతుందని.. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని విశ్వాసం.
- పిల్లలకు చదువు పట్ల ఆసక్తి లేకుంటే.. వారి దృష్టి చదువుమీద వెళ్లేలా చేయడానికి సరస్వతీ దేవిని పూజించేలా చేయండి. పిల్లల చేతులతో సరస్వతి తల్లికి పసుపు పండ్లు, పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షతలను సమర్పించండి. ఇలా చేయడం వలన సరస్వతి దేవి అనుగ్రహంతో పిల్లల మానసిక వికాసాన్ని అనుగ్రహిస్తుంది.
- కొంత మంది పిల్లలు కొన్ని మాటలు మాట్లాడడానికి కష్టపడతారు. కొంతమంది ఎంత చదివినా.. దానిని సరిగ్గా వ్రాయలేరు. వసంత పంచమి నాడు వెండి పెన్నును తేనెలో ముంచి.. పిల్లల నాలుకపై ‘ఓం’ రాయండి. ఇలా చేయడం వలన మాట్లాడటంలో సమస్యలను తొలగిస్తుందని.. పిల్లలు చదువులో ముందుంటారని నమ్ముతారు.
- చదువులో ఆటంకాలు ఎదురయ్యే విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి దేవికి తెల్ల చందనం సమర్పించి.. అనంతరం ‘ఓం ఐం సరస్వత్యై నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ సరస్వతి మూల మంత్రం చదివితే చదువులో విజయం సాధిస్తారని నమ్మకం.
- వసంత పంచమి నాడు చదువుకునే పేద స్టూడెంట్స్ కు పుస్తకాలు, పెన్నులు వంటి వాటిని మీ పిల్లల చేతుల మీదుగా అందించండి. ఇలా చేయడం వల్ల వాక్ లోపాలు తొలగిపోతాయని, పిల్లల జ్ఞాపకశక్తి మరింత పదును పెడుతుందని నమ్మకం. పిల్లల మనస్సులను ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికి, సరస్వతీ దేవి పాదాల వద్ద పుస్తకాలు, పెన్నులను ప్రసాదంగా సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు