తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని రేపు (మంగళవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం సందర్భంగా మంగళవారం బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సోమవారం సిఫార్సు లేఖలు తీసుకోవడం లేదని టీటీడీ వెల్లడించింది. మరోవైపు.. తిరుమలలో 14 క్యూ కంపార్ట్‌మెంట్‌లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు సమయం పడుతోంది.
తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులే కాకుండా దుకాణదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తిరుమలలో రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఏకాదశి నాడు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల మధ్య వైరస్ వ్యాప్తి కారణంగా టీటీడీ అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టింది. యాత్రికులు, భక్తులు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక దర్శనానికి సంబంధించిన రిజర్వేషన్ టిక్కెట్లను ఈ ఉదయం విడుదల చేశారు. ప్రత్యేక దర్శనం కోసం టిక్కెట్లతో వచ్చే భక్తులు కరోనా వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకురావాలని టీటీడీ సూచిస్తోంది. ధ్రువపత్రాలు లేకుండా వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించబోమని తిరుమల దేవస్థానం బోర్డు ప్రకటించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి