Chanakya Niti: ఎప్పుడు మాట్లాడాలి..? ఎప్పుడు మౌనంగా ఉండాలి…? మౌనం పాటించాల్సిన 4 ప్రదేశాలు..!
ఆచార్య చాణక్యుడు తన అపారమైన జ్ఞానాన్ని, జీవిత అనుభవాలను రంగరించి ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు. అదే చాణక్య నీతి. ఈ గ్రంథాన్ని జ్ఞాన సముద్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను, సూక్ష్మ విషయాలను వెల్లడించారు. మనిషి ప్రవర్తన, రాజకీయాలు, ఆర్థికం, నైతిక విలువలు ఇలా ప్రతి అంశం గురించి ఆయన తన అభిప్రాయాలను, సూచనలను అందించారు.

చాణక్య నీతి కేవలం మానవుల మంచి లక్షణాల గురించే కాకుండా వారిలోని బలహీనతలు, లోపాలను కూడా వివరిస్తుంది. మనిషి ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనే విషయాన్ని కూడా బోధిస్తుంది. చాణక్య నీతిలో చెప్పిన విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎలాంటి కష్టాన్ని అయినా సులభంగా ఎదుర్కోగలడు. ఎందుకంటే అతను మంచి చెడులను విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పొందుతాడు. చాణక్యుడు నాలుకను అదుపులో ఉంచుకోవాలని ప్రతి చోటా మాట్లాడకూడదని సూచించాడు. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటమే ఉత్తమమని అంటున్నారు చాణక్యుడు.
మౌనంగా ఉండాల్సిన ప్రదేశాలు
కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో మౌనంగా ఉండటం చాలా అవసరం. లేకపోతే మన పనులకు ఆటంకం కలుగుతుంది. నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. చాణక్యుడు నాలుగు ప్రదేశాల గురించి చెప్పాడు. అక్కడ జ్ఞానులు ఎప్పుడూ మాట్లాడరు.
పోరాట స్థలం
ఎక్కడ గొడవలు, కొట్లాటలు జరుగుతున్నాయో అక్కడ మౌనంగా ఉండాలి. కొంతమంది తనని అడగకపోయినా జోక్యం చేసుకుని సలహాలు ఇస్తారు. అలాంటి వారికి చాణక్యుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. ఎక్కడ పోరాటం జరుగుతుందో అక్కడ మౌనంగా ఉండండి. ఎవరైనా వచ్చి ఏదైనా చెబితే తప్పా మీరే స్వయంగా మాట్లాడకండి.
ప్రశంసలు
కొందరు వ్యక్తులు తమను తాము ఎక్కువగా పొగుడుకుంటూ ఉంటారు. అలాంటి ప్రదేశంలో మౌనంగా ఉండటమే మంచిది. అక్కడ మీరు ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని అవమానించే అవకాశం ఉంది.
సగం జ్ఞానం
సగం నిండిన కుండ తొణికిసలాడుతుంది అనే సామెత మనకు తెలుసు. అంటే కుండ ఖాళీగా ఉంటే నీరు చిల్లుతుంది. నిండితే చిందదు. అలాగే కొంతమందికి తక్కువ జ్ఞానం ఉంటే ఎక్కువగా మాట్లాడుతారు. పూర్తి జ్ఞానం ఉన్నవారు ప్రశాంతంగా ఉంటారు. సగం సమాచారం ఉన్నా మౌనంగా ఉండటం మంచిదని చాణక్యుడు చెప్పాడు.
ఇతరుల సమస్యలు
ఎవరైనా మీకు వారి సమస్యను చెబితే శ్రద్ధగా వినండి. వారి బాధను, ఇబ్బందులను అర్థం చేసుకోండి. ఆ సమయంలో మౌనంగా ఉండటం మంచిది. వారికి సహాయం చేయడానికి ప్రయత్నించండి. కానీ అనవసరమైన మాటలు చెప్పి వారిని ఇబ్బంది పెట్టకండి.