Chanakya Niti: చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థికవేత్త, దౌత్య నిపుణుడు. మానవ జీవితంలో ఎదుర్కునే చాలా విషయాలకు ఆయన పరిష్కారం చూపాడు. శత్రువుల గురించి కూడా విశ్లేషించాడు. మన శత్రువులు బయట మాత్రమే కాదు, ఇంట్లో కూడా ఉండవచ్చు. నిజానికి బయట శత్రువులకంటే ఇంట్లో ఉన్న శత్రువులే ఎక్కువ ప్రమాదకరమని చాణక్యుడు హెచ్చరించాడు.

భారత ఆర్థిక శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతి గ్రంథంలో అనేక మానవ జీవితంలోని సమస్యలకు పరిష్కారం చూపాడు. ఇందులో శత్రువులను ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియజేశారు. శత్రువుల స్వభావం, వారిని గుర్తించే విధానం, శత్రువును ఓడించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దాడి చేయడానికి సరైన సమయం వంటి అనేక విషయాలను వివరించాడు. ఆయన ప్రకారం శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి బాహ్య శత్రువులు – వీరు మనకు బహిరంగంగానే ఉంటారు. కాబట్టి వారి పట్ల జాగ్రత్తగా ఉండటం, వ్యూహాలు రూపొందించడం సులభం.
వీరితో జాగ్రత్త
కానీ, రెండవ రకం అంతర్గత శత్రువులు – అంటే మన కుటుంబంలోనే, మనకు అత్యంత దగ్గరగా ఉండే వారు. వీరే అసలు ప్రమాదకరమైనవారు. ఎందుకంటే వారు శత్రువులుగా మనకు కనిపించరు. అందుకే మన జీవితంలో పెద్ద నష్టానికి కారణమవుతారు.
ఆ సంకేతాలు గుర్తించాలి..
అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చాణక్యుడు సూచించాడు. కుటుంబంలో ఎవరో ఒకరు మీ ఎదుగుదలను చూసి అసూయ పడుతున్నా, లేదా మీకు హాని చేయాలని అనుకుంటున్నా, కొన్ని సంకేతాల ద్వారా అది తెలుస్తుంది. అలాంటి సంకేతాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్తపడటం మంచిదని చాణక్యుడు చెబుతాడు.
ప్రణాళికలు
మీ ఇంట్లో శత్రువు ఉన్నాడని అనిపిస్తే.. మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచాలి. మీ వ్యాపారం లేదా జీవిత లక్ష్యాలు పూర్తయ్యే వరకు వాటిని ఇంట్లో కూడా చర్చించకపోవడమే మంచిది.
డబ్బు విషయాలు
మీ ఆదాయం, ఆస్తి లేదా మీ వద్ద ఉన్న డబ్బు గురించి ఇంట్లో కూడా బహిరంగంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ సమాచారాన్ని ఉపయోగించి మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నే అవకాశం ఉంటుందని చాణక్యుడు హెచ్చరించాడు.
నమ్మకమైన వ్యక్తి
మీకు ఇంట్లోనే శత్రువు ఉన్నప్పుడు, పూర్తిగా నమ్మగల కనీసం ఒక వ్యక్తి ఉండటం చాలా అవసరం. మీరు లేని సమయంలో కూడా మీ పనులను నిజాయితీగా, విశ్వాసంతో చూసుకునే వ్యక్తి ఉండాలని చాణక్యుడు సూచించాడు.
