Bhishma Niti: పాలకులను ప్రజలే గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారంటూ ప్రజాధర్మం గురించి చెప్పిన భీష్ముడు

|

Mar 31, 2022 | 9:12 AM

Bhishma Niti: రామాయణ, మహాభారతం నేటి మానవుని జీవిత గమనానికి మార్గాన్ని నిర్ధేసిస్తాయి. పంచామవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన..

Bhishma Niti: పాలకులను ప్రజలే గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారంటూ ప్రజాధర్మం గురించి చెప్పిన భీష్ముడు
Bhhishma Niti
Follow us on

Bhishma Niti: రామాయణ, మహాభారతం నేటి మానవుని జీవిత గమనానికి మార్గాన్ని నిర్ధేసిస్తాయి. పంచమవేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. మహాభారతానికే వెన్నుముకగా నిలిచిన భీష్ముడు… అంపశయ్యపై ఉన్నప్పుడు రాజ్య పాలన, రాజధర్మం, వంటి అనేక విషయాలపై పాండవులకు హితబోధ చేశాడు. అంపశయ్యపై నున్న భీష్ముడు యుధిష్టిరుని సందేహాలను తీర్చడానికి చేసిన ఉపదేశాలు నేటి పాలకులకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఈరోజు ధర్మరాజు భీష్మపితామహునితో ప్రజలు ఏ ధర్మం ఆచరిస్తే సుఖంగా జీవిస్తారు అని అడిగిన సందేహానికి భీష్ముడు ఇచ్చిన సమాధానం గురించి ఈరోజు తెలుసుకుందాం..

భీష్ముడు ” ధర్మరాజా .. ప్రజలు తమకు ఒక రాజును నియమించుకుని ఆయనను అభిషిక్తుడిని చేసి ఆయన పాలనలో ప్రజలు సుఖంగా జీవిస్తారు. అలా పాలించే రాజు లేకపోతే ప్రజలు ధర్మంతప్పి ఒకరి ధనంను, భార్యను ఒకరు అపహరించుతూ, ఒకరి సొత్తును ఒకరు దోచుకుంటూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. ప్రజా జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి పాలకుడు కావాలి.. లేకుంటే ప్రజాజీవితం అస్తవ్యస్థం ఔతుంది. వ్యవసాయము, వ్యాపారం, గోరక్షణ మొదలైన వృత్తులు నాశనం ఔతాయి. ఒకానొక సమయంలో పాలకులు లేక దొంగతనం, అక్రమప్రవర్తన, దుర్మార్గం పెచ్చుమీరి ప్రజలజీవితం కల్లోలితం అయింది. అప్పుడు సాధారణ ప్రజలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి తమకు రాజును ప్రసాదించమని బ్రహ్మదేవుడిని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు వారికి ‘మనువును రాజుగా నియమించాడు. మనువు అసత్యం పలికే వారికి, దుర్మార్గులకు తాను రాజుగా ఉడలేనని చెప్పాడు. అప్పుడు ప్రజలు ” పశువులలో బంగారంలో సగభాగం పన్ను కింద చెల్లిస్తాము. పండించిన పంటలో పదవభాగం ఇస్తాము. వాటితో మంచి సైన్యమును సమకూర్చుకుని నీ పరాక్రమంతో దుష్టులను శిక్షిస్తూ శిష్టులను రక్షిస్తూ రాజ్యపాలన చెయ్యండి. ప్రజలంతా నీ ఆజ్ఞలకు లోబడి ప్రవర్తిస్తాము. అధర్మ వర్తనులు నీ చేత శిక్షించబడతారు. ధర్మాత్ముల పుణ్యంలో ఆరవవంతు నీకు చెందుతుంది. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లు మీరు మమ్ము రక్షించండి ” అని వేడుకున్నారు. కనుక ధర్మరాజా… రాజాజ్ఞను పాలించడం ప్రజల కర్తవ్యం.

ప్రజలు పాలకులను దైవంలా పూజించాలి రాజు ఎప్పుడైనా ధర్మం తప్పి ప్రవర్తిస్తే ప్రజలు దానిని సహించాలి. ప్రజలు ఆ విధంగా ప్రవర్తిస్తేనే శత్రువులు కూడా రాజును చూసి భయపడతారు. ప్రజలే రాజును గౌరవించనప్పుడు శత్రువులు అతడిని అలక్ష్యం చేస్తారు. కనుక ప్రజలు రాజుపట్ల భయభక్తులు చూపడం ఉచితం. రాజుకు ఉత్తమమైన సింహాసనం, వాహనములు, మంచి నివాసగృహం, రుచికరమైన ఆహారపదార్ధములు, ఆడంబరమైన వస్త్రములు, అంగరక్షకులను సమకూర్చడం అత్యవసరం. వాటిని సమకూర్చడం ప్రజలకర్తవ్యం ” అని భీష్ముడు చెప్పాడు. భీష్ముడు ఇంకా ” ధర్మజా! లోకంలో ధర్మములకు రాజు మూలము. రాజు లేని రాజ్యం నీరులేని సరస్సు వంటిది.  ఇంద్రియ నిగ్రహం పాటించి రాజును సేవించిన వారిని రాజు సకల సందలతో సత్కరిస్తాడు. రాజుకు ప్రజలు శరీరం వంటి వారు. ప్రజలకు రాజు ఆత్మ వంటి వాడు. ప్రజలు రాజును పూజించాలి. రాజు ప్రజలను రక్షించాలని భీష్ముడు ప్రజారాజ్యం గురించి చెప్పాడు.

Also Read: ఆ దేశ ప్రజలు, పాలకుల నిర్లక్ష్యం.. మళ్ళీ విజృంబిస్తోన్న కరోనా.. వారం రోజులపాటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు