Balapur: శోభాయాత్రలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్‌ గణేశుడి రూట్‌మ్యాప్‌ ఇదే..!

నవరాత్రులు గణపతి బప్పా మోరియా అంటూ పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనానికి రంగం సిద్ధమైంది. భాగ్యనగరం వినాయక శోభాయాత్రలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్‌ గణేశుడి రూట్‌మ్యాప్‌ ఎలా ఉండబోతోంది. ఇక్కడి నుంచే యాత్ర ఎందుకు మొదలవుతుంది?

Balapur: శోభాయాత్రలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్‌ గణేశుడి రూట్‌మ్యాప్‌ ఇదే..!
Balapur Ganesh

Updated on: Sep 06, 2025 | 7:33 AM

నవరాత్రులు గణపతి బప్పా మోరియా అంటూ పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నిమజ్జనానికి రంగం సిద్ధమైంది. శోభాయాత్రలో ప్రత్యేకంగా నిలిచే బాలాపూర్‌ గణేశుడి రూట్‌మ్యాప్‌ ఎలా ఉండబోతోంది. ఇక్కడి నుంచే యాత్ర ఎందుకు మొదలవుతుంది?

హైదరాబాద్‌లో జరిగే గణేష్‌ ఉత్సవాలకే ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తోంది బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర. బాలాపూర్‌ పురవీధుల నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ట్యాంక్‌బండ్‌ దగ్గర ముగుస్తుంది. శోభాయాత్రలో ఎప్పటి నుంచో బాలాపూర్‌ వినాయకుడి సెంటిమెంట్‌ బలంగా ఉంది. ఇక్కడి నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. దాని వెనుకే మిగతా విగ్రహాలు గంగమ్మ దగ్గరికి తరలివెళ్తాయి. బాలాపూర్‌ గణేశుడి నిమజ్జనం పూర్తయితేనే శోభాయాత్ర ముగిసినట్టు చెబుతారు. బాలాపూర్‌ గణేశుడి నిమజ్జనం ముగిసినా గతంలో ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహ నిమజ్జనానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు మాత్రం మధ్యాహ్నంలోపే నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఉదయం పూజతో బాలాపూర్‌ గణపయ్య శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో నిర్వాహకులు విగ్రహాన్ని ఎక్కిస్తారు. ఆ తర్వాత గ్రామ బొడ్రాయి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వేలం పాట నిర్వహిస్తారు. వేలం పాటలో ఈ లడ్డూకి ఎంతో ప్రత్యేకత ఉంది. 29 సంవత్సరాల క్రితం 420 రూపాయలతో మొదలైన వేలం పాట రికార్డు స్థాయిలో గత ఏడాది వరకు 30 లక్షల రూపాయల వరకు చేరుకుంది. ఈ ఏడాది ఎంత పలుకుతుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వేలం పాట పూర్తి కాగానే లడ్డూతో పాటు గణనాథుడిని బాలాపూర్‌ ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. భక్తులంతా మంగళహారతులతో స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత చంద్రాయణగుట్టకు గణేశుడు పయనమవుతాడు.

మొత్తం 19 కిలోమీటర్ల మేర బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర సాగుతుంది. గుర్రం చెరువు కట్టమైసమ్మ వద్ద నుంచి హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుంది. బాలాపూర్‌ నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, మహబూబ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు, ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి, అలియాబాద్‌ మీదుగా కన్నులపండువగా యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత చార్మినార్‌కు చేరుకుని బషీర్‌బాగ్‌, లిబర్టీ, ఎన్టీఆర్‌ మార్గ్‌, అంబేడ్కర్‌ విగ్రహం, నెక్లెస్‌ రోడ్డు.. ఇలా 18 ముఖ్యమైన జంక్షన్ల మీదుగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. దారి పొడవునా జైజై గణేశా అంటూ భక్తులు మహా గణపతికి స్వాగతం పలుకుతారు.

రాత్రి 11 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ క్రేన్‌ దగ్గరికి చేరుకోనున్నాడు బాలాపూర్‌ గణేశుడు. క్రేన్‌ దగ్గర మళ్లీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులందరికీ చివరిగా దర్శనమిచ్చి గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు మహా గణపతి. శోభాయాత్ర భద్రత కోసం పోలీస్‌, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. చార్మినార్‌, తెలుగుతల్లి వంతెన సమీపంలోని ఊరేగింపు మార్గాలను పోలీస్, ఇతర శాఖలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. బాలాపూర్‌ గణేశుడితో మొదలై.. ఆ గణపయ్య నిమజ్జనంతోనే ముగిసే శోభాయాత్రను కన్నుల్లారా దర్శించుకునేందుకు భక్తులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..