AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ వేషంలోకి ఎందుకు మారుతారో తెలుసా?

Badrinath Panch Pooja 2026: బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసివేసే ముందు ఓ ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తారు. ఈ సమయంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ జీ మహిళా వేషధారణలోకి మారి లక్ష్మీదేవి విగ్రహాన్ని స్వామివారి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. అసలు ఆయన ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న మతపరమైన విశ్వాసం ఏమిటో తెలుసుకుందాం.

బద్రీనాథ్ ఆలయంలో వింత ఆచారం.. ద్వారాలు మూసే ముందు రావల్ జీ స్త్రీ వేషంలోకి ఎందుకు మారుతారో తెలుసా?
Badrinath Panch Pooja 2026
Rajashekher G
|

Updated on: Nov 16, 2026 | 2:49 PM

Share

Badrinath Temple Panch Pooja: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర హిందువులకు అత్యంత పవిత్రమైనది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించుకుంటారు. వీటిలో బద్రీనాథ్ ధామ్ శ్రీమహావిష్ణువుకు అంకితం చేయబడింది. బద్రీ విశాల్ స్వామి కొలువైన ఈ ఆలయ ద్వారాలను వేసవిలో భక్తుల దర్శనార్థం తెరిచి, భారీ హిమపాతం, తీవ్రమైన చలి కారణంగా శీతాకాలంలో మూసివేస్తారు. ఈ ఏడాది నవంబర్ 16, 2026న రాత్రి 9:37 గంటలకు బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూతపడనున్నాయి. అనంతరం ఆరు నెలల పాటు జోషిమఠ్‌లోని నరసింహ ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహిస్తారు.

ద్వారాలు మూసే ముందు పంచ పూజలు

బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసివేయడానికి ఐదు రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. వీటినే పంచ పూజలు అంటారు. ఈ సమయంలో ఆలయంలో నిత్యం నిర్వహించే కొన్ని ఆచారాల్లో మార్పులు చేస్తారు. స్వామివారి శీతాకాల నివాసానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ఈ పూజల్లో అత్యంత విశేషమైనది లక్ష్మీదేవి విగ్రహాన్ని బద్రీ విశాల్ స్వామి గర్భగుడిలోకి చేర్చే సంప్రదాయం. ఈ సమయంలో ఆలయ ప్రధాన పూజారి రావల్ జీ మహిళా వేషధారణలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బద్రీనాథ్ ఆలయంలో రావల్ ఎవరు?

బద్రీనాథ్ ఆలయ ప్రధాన అర్చకుడిని రావల్ అని పిలుస్తారు. స్వామివారికి నిత్యపూజలు నిర్వహించడం, ముఖ్యమైన ధార్మిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించడం ఆయన బాధ్యత. ఈ రావల్ సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని విశ్వాసం. సంప్రదాయం ప్రకారం, రావల్ కేరళకు చెందిన నంబూదిరి బ్రాహ్మణుడై ఉండాలి. ప్రస్తుతం ఆలయ ప్రధాన పూజారిగా అమర్‌నాథ్ నంబూదిరి కొనసాగుతున్నారు. రావల్ జీ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, ఆలయ పూజా నియమాలను అత్యంత నిష్ఠతో అనుసరిస్తారు.

ఇవి కూడా చదవండి

రావల్ జీ మహిళా వేషధారణ వెనుక ఉన్న కారణం ఏమిటి?

బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మూసివేసే సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆమె ఆలయం నుంచి తీసుకొచ్చి బద్రీ విశాల్ స్వామి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమాన్ని రావల్ జీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మతపరమైన సంప్రదాయం ప్రకారం, రావల్ జీ బ్రహ్మచారి కావడంతో మహిళలను తాకకూడదనే నియమాన్ని పాటిస్తారు. అదే సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పురుషులు తాకకూడదనే విశ్వాసం కూడా ఉంది. ఈ రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ రావల్ జీ మహిళా వేషధారణలోకి మారుతారు. లక్ష్మీదేవి స్నేహితురాలి రూపంలో విగ్రహాన్ని స్వయంగా తీసుకెళ్లి బద్రీ విశాల్ స్వామి పక్కన ప్రతిష్ఠిస్తారు.

శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ విశిష్ట ఆచారం బద్రీనాథ్ ఆలయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు, అక్కడి భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది.

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న ఆచారాలు, సంప్రదాయాలు హిందూ మత విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని భక్తుల విశ్వాసాల కోణంలోనే చూడగలరు.)

Follow Us