
అయోధ్య రామాలయం ప్రవేశ నిష్క్రమణ ప్రణాళికలలో మార్పు చేశారు. ఈ మార్పు కారణంగా దాదాపు నెల రోజులుగా భక్తులు తమ బూట్లు, చెప్పులను వదిలివేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికే దాదాపు 30 ట్రాలీల బూట్లు, చెప్పులను తొలగించింది. గతంలో యాత్రికులు రామయ్య దర్శనం కోసం వెళ్తూ తమ చెప్పులను గేట్ నంబర్ 1 వద్ద వదిలి వెళ్ళేవారు. దర్శనం అనంతరం దాదాపు అర కిలోమీటరు వృత్తాకార మార్గాన్ని పూర్తి చేసిన తర్వాత తాము చెప్పులు వదిలి వెళ్ళిన ప్రదేశానికి వచ్చి మళ్ళీ ధరించేవారు. అయితే.. కుంభ మేళా సమయంలో అయోధ్య రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడం వల్ల, పరిపాలన సిబ్బంది దర్శనం చేసుకుని ఆలయం నుంచి తిరిగి బయటకు వచ్చే దారిలో మార్పులు చేసింది. గేట్ నంబర్ 3, ఇతర ద్వారాల ద్వారా నిష్క్రమణలను దారి మళ్లించింది.
రామాలయంలోనికి ప్రవేశ స్థానం నుంచి తమ పాదరక్షలను తిరిగి పొందడానికి యాత్రికులు ఇప్పుడు రాంపత్‌లో దాదాపు 5-6 కిలోమీటర్లు నడవాలి. దీని కారణంగా ఇప్పుడు భక్తులు తమ పాదరక్షలను వదిలివేసి తమ వాహనాల వద్దకు లేదా బస చేసే ప్రాంతానికి చెప్పులు లేకుండా వెళ్లడానికి ఎంచుకుంటున్నారు. అక్కడ చెప్పులు, బూట్లు కుప్పలుగా పోగవుతున్నాయి. దీంతోప్రతిరోజూ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈ పాదరక్షల కుప్పలను JCB యంత్రాలను ఉపయోగించి తొలగిస్తుంది. ట్రాలీలలో లోడ్ చేసి వేరే ప్రాంతానికి తరలిస్తుంది.
ఈ విషయంపై రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. గత 30 రోజులుగా ఊహించని విధంగా భారీ సంఖ్యలో భక్తులు అయోధ్య బాల రామయ్య దర్శనానికి పోటెత్తారని.. దీంతో భక్తులు సులభంగా రామయ్య దర్శనం కోసం చేరుకునేలా ఏర్పాట్లలో మార్పులు చేయబడ్డాయి” అని అన్నారు. దర్శనం సజావుగా జరిగేలా చూసేందుకు నిష్క్రమణ ఏర్పాట్లలో మార్పు అమలు చేయబడింది.
45 రోజులకు పాటు జరిగిన మహా కుంభమేళా సమయంలో దాదాపు 1.25 కోట్లకు పైగా భక్తులు అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించారు. మకర సంక్రాంతి రోజు నుంచి భక్తుల ప్రవాహం ప్రారంభమై మహా శివరాత్రి వరకు నిరంతరాయంగా కొనసాగింది. జనవరి 26 నుంచి అయోధ్యలో పర్యటించే వారి సంఖ్య లక్షలకు చేరుకుంది. దాదాపు 10 నుంచి 12 లక్షల మంది భక్తులు నగరానికి తరలివచ్చారు. మొట్టమొదటిసారిగా దర్శనం కోసం వచ్చే భక్తులతో నిరంతర ప్రవాహం కారణంగా బాలా రామయ్య (రామ్ లల్లా) ఆలయ తలుపులు తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉన్నాయి” అని మిశ్రా చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..