Ayodhya: జైళ్లలోని ఖైదీలకు అయోధ్య బాలరాముడి దర్శనం… ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం

| Edited By: Surya Kala

Jan 05, 2024 | 7:59 AM

రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఖైదీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. మహా దేవాలయం కుంకుమార్చన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ జైళ్లు - హోంగార్డుల సహాయ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి ప్రకటించారు. ఈ మేరకు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్లందరినీ కోరినట్లు తెలిపారు.

Ayodhya: జైళ్లలోని ఖైదీలకు అయోధ్య బాలరాముడి దర్శనం... ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యూపీ ప్రభుత్వం
Ayodhya Ram Mandir
Follow us on

జనవరి 22.. భారత్‌లోనే కాదు.. దేశ విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు.. ముఖ్యంగా హిందువులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామమందిరంలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఒక పెద్ద మహోత్సవంగా జరగనుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సహా పెద్ద సంఖ్యలో ఋషులు, సాధువులు, ప్రముఖులు హాజరుకానున్నారు. ఆ రోజు దేశమంతటా ప్రజలు తమ ఇళ్లల్లో రామ జ్యోతి వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పిలుపునిచ్చారు. విగ్రహ ప్రతిష్ఠను వీక్షించేందుకు లక్షలాది భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్తుండగా.. కోట్లాది మంది సుదూర తీరాల నుంచి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వివిధ కారణాలతో జైలుపాలైన ఖైదీలకు సాధారణంగా బయటి ప్రపంచంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఖైదీలను సైతం ఈ మహత్తర కార్యక్రమంలో భాగం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ పర్వదినాన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జైలు ఖైదీల కోసం ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే దేశంలోని నగరాలు, గ్రామాల్లో ఊరేగింపులు జరుగుతున్నాయి. యూపీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో భజన-కీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రామ్ చరిత్ మానస్ నిరంతర పారాయణం ఉత్తర్‌ప్రదేశ్ అంతటా జరుగుతోంది. రామభక్తుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న యోగి ప్రభుత్వం రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలను ప్రతి ఒక్కరూ చూసేలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించింది.

దేశవ్యాప్తంగా జైళ్లలో వివిధ నేరాల్లో నేరారోపణలు రుజువై శిక్ష పడ్డ ఖైదీల కంటే నేరారోపణ ఎదుర్కొంటూ రిమాండ్‌లో భాగంగా అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నవారి సంఖ్యే ఎక్కువ. శిక్ష పడ్డవారికైనా.. అండర్ ట్రయల్ ఖైదీలకైనా పెరోల్ మీద బయటికొస్తేనో.. బెయిల్ దొరికితేనో తప్ప బాహ్య ప్రపంచంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడం సాధ్యం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, పర్వదినాల్లో వారికి టీవీ చూసే వెసులుబాటు కల్పిస్తుంటారు. ఇప్పుడు రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం ఖైదీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో.. మహా దేవాలయం కుంకుమార్చన ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ జైళ్లు – హోంగార్డుల సహాయ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి ప్రకటించారు. ఈ మేరకు అయోధ్యలో ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్లందరినీ కోరినట్లు తెలిపారు. జైళ్లలో గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ మంత్రం పఠించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇదిలా ఉంటే.. ఖైదీలు తమ కష్టాలను మర్చిపోయేందుకు భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక చింతనను ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ పుస్తకాలను ఖైదీలకు ప్రభుత్వం అందజేస్తోంది. ప్రస్తుతం హనుమాన్ చాలీసా, సుందర‌కాండ పుస్తకాలు కావాలంటూ ఖైదీల నుంచి డిమాండ్ పెరిగిందని రాష్ట్ర మంత్రి తెలిపారు. ఈ క్రమంలో గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతా ప్రెస్ నుంచి సుందర‌కాండ, హనుమాన్ చాలీసా 50 వేల కాపీలు ఆర్డర్ చేసినట్టు మంత్రి వివరించారు. ఈ కాపీలను త్వరలో అన్ని జైళ్లలో పంపిణీ చేయనున్నారు.

ఇటీవల సీఎం యోగి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 2024 జనవరి 14 నుంచి మార్చి 24 వరకు అయోధ్యలోని దేవాలయాల్లో రామాయణం, భజన కీర్తనలు, రామచరిత్ మానస్‌తో పాటు సుందరకాండ పఠనం కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రవాణా శాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించింది. రామభక్తుల ఉత్సాహాన్ని చూసిన యోగి ప్రభుత్వం ప్రయాణికుల ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు సన్నాహాలు చేసింది. సీఎం యోగి ఆదేశాల మేరకు రవాణా శాఖ ఈ మహాకార్యక్రమానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జనవరి 22 వరకు అన్ని బస్సుల్లో రామ్ భజన చేసేలా ఏర్పాట్లు చేసింది. అలాగే అన్ని ప్యాసింజర్ వాహనాలు, బస్ స్టేషన్లలో పరిశుభ్రత పాటించాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. బస్సుల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లో రామ్ భజన ప్లే అవుతుంది. ప్రముఖ కళాకారుల భజనలతో పాటు నేటి భజనలు, శ్రీరాముడికి సంబంధించిన పాటలు కూడా ప్లే చేయనున్నారు. ఇది కాకుండా, స్థానిక గాయకుల రామ్ భజనలు కూడా ఇందులో చోటు సంపాదించవచ్చు. తద్వారా ఉత్తరప్రదేశ్‌లోని ప్రజలలో రామోత్సవ్ గురించి ఉత్సుకతను సృష్టించడం యోగి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రతి సామాన్యుడు ఏదో ఒక రూపంలో ఈ కార్యక్రమంతో కనెక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మర్యాద రామన్న చెంత.. అతిధి దేవో భవః

అయోధ్యకు చేరుకునే వివిధ రాష్ట్రాల యాత్రికులు, భక్తులకు మధురమైన అనుభూతిని కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యాత్రికులను ఏ చిన్న విషయంలోనూ ఇబ్బందిపెట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం టాక్సీ, అన్ని టూరిస్ట్ బస్సు వాహనాల యజమానులతో సమావేశం నిర్వహించింది. అయోధ్యలో టాక్సీలు, టూరిస్ట్ బస్సుల డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించింది. అలాగే వాహనాలను సురక్షితంగా నడపడం, పర్యాటకుల పట్ల డ్రైవర్ల ప్రవర్తన, ట్రాఫిక్ నియమాలను పాటించడం, ఎలాంటి మత్తు పానీయాలు, పాన్ – గుట్కాలు సేవించకుండా ఉండడం, డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించడం, వాహనం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం వంటి విషయాల్లో వారికి అవగాహన కల్గించంది. అలాగే నిర్ణీత ఛార్జీల కంటే ఎక్కువ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేయకూడదని ఆదేశించింది. సురక్షితమైన ప్రయాణం కోసం, హోర్డింగ్‌లు, వార్తాపత్రికలు, ప్రచార వ్యాన్‌లు, డిజిటల్ బ్యానర్‌లు మరియు అన్ని సామాజిక మాధ్యమాల ద్వారా రహదారి భద్రత మరియు ట్రాఫిక్ నియమాల గురించి ప్రచారం కూడా చేస్తోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..