అమర్‌నాథ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో మంచు రూపంలో కనిపించే అమర్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఏటా భారీగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ యాత్ర సాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు అమర్‌నాథ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చని అధికారులు చెప్పారు. ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో జరుగుతాయని వెల్లడించారు. అందులో 316 పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖలు, 37 ఎస్ బ్యాంక్ శాఖలు, 99 ఎస్‌బీఐ బ్యాంక్ శాఖలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
అయితే ఈ ఏడాది రిజిస్ట్రేషన్లో అధికారులు కొత్త రూల్‌ను తీసుకొచ్చారు. యాత్రలో పాల్గొనబోయే భక్తులు కచ్చితంగా ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేయించి.. వేలిముద్ర స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది కూడా రెండు మార్గాల ద్వారా యాత్ర కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక ఈ యాత్రలో పాల్గొనాలనుకొనే ఔత్సాహిక యాత్రికులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పొందడం తప్పనిసరన్నారు. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
మరోవైపు ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలి వస్తారన్న అంచనా ఉంది. ఈనేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..