Amarnath Yatra 2023: భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ పుణ్య క్షేత్రాల్లో అమర్ నాథ్ ఒకటి. అమర్‌నాథ్ యాత్రకు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని చాలా మంది శివభక్తులు కోరుకుంటారు. ఎందుకంటే.. అమర్‌నాథ్ అంత పవిత్ర పుణ్య క్షేత్రం. ఎత్తైన పర్వతాల మధ్య అమర్‌నాథ్ ఆలయం ఉంటుంది. అయితే భక్తులు ఇక్కడికి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెళ్లడం కుదరదు. హిమాలయాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే ఈ యాత్రకు అవకాశం కల్పిస్తారు. కేవలం రెండు నెలలు మాత్రమే ఇక్కడికి అనుమతిస్తారు. ఆ తేదీల కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు.
అయితే ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమర్ నాథ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు అమర్‌నాథ్ యాత్రకు కేంద్రం ఏర్పాటు చేసింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్‌నాథ్ ఆలయం ఉంది. అమర్‌నాథ్ గుహలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది మంది భక్తులు దేశ నలుమూల నుంచి తరలివెళ్తుంటారు. అనంతనాగ్జిల్లా పహల్గామ్, గండర్బాల్ జిల్లా బల్టాల్ మార్గాల్లో 2023 అమర్నాథ్యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇంకా ఉదయం, సాయంత్రం ప్రార్థనలను ఈసారి లైవ్ టెలికాస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చూసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలాగే.. అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలు, భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మరోవైపు ఈ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు ఇటీవల నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. ఇద్దరు కశ్మీరీ యువకులకు దాడి బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. దీంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.