Huzurabad By Election: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ.. తెరపైకి కొత్త పేర్లు

| Edited By: Srinivas Chekkilla

Sep 29, 2021 | 11:32 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ రానే వచ్చింది. టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే హుజురాబాద్‎లో..

Huzurabad By Election: హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై వీడని ఉత్కంఠ.. తెరపైకి కొత్త పేర్లు
Huzurabad
Follow us on

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ రానే వచ్చింది. టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే హుజురాబాద్‎లో తమ అభ్యర్థిని ప్రకటించి జోరుగా ప్రచారం చేస్తోంది. ఇటు బిజెపి నుంచి ఈటల రాజేందర్ కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్కడ గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పరిస్థతి ఏంటీ?.. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు?.. హుజురాబాద్‎ ఉప ఎన్నికపై హస్తం పార్టీ వైఖరి ఏమిటో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతరవరకు అభ్యర్థినే ప్రకటించలేదు. ఆ పార్టీ అభ్యర్థి ఎవరు అనేది జోరుగా చర్చ నడుసోంది. డిసెంబర్ లేదా జనవరిలో షెడ్యూల్ వస్తుందని టీ కాంగ్రెస్ పెద్దలు భావించినప్పటికీ.. ముందే షెడ్యూల్ రావటంతో అభ్యర్థి ఖరారుపై నేతలు ఫోకస్ పెట్టారు. ఒకటి రెండు సార్లు అభ్యర్థి ఎంపిక కోసం చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. అయితే హుజురాబాద్‎లో పోటీ చేయడానికి 19 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అభ్యర్థి ఎంపిక కోసం మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ ముగ్గురు పేర్లను సూచిస్తూ పీసీసీ, ఏఐసీసీకి నివేదిక అందజేసింది. మాజీ మంత్రి కొండా సురేఖ, సదానందం, పత్తి కృష్ణా రెడ్డి పేర్లను నివేదికలో పొందుపర్చింది. మొదట్లో కొండా సురేఖకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ స్థానిక నేతలు వ్యతిరేకించడంతో కొండా సురేఖ పేరును పీసీసీ నేతలు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. లోకల్ లీడర్లు కొండ సురేఖను వ్యతిరేకించడంతో అభ్యర్థి ఎంపిక కోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహతో పీసీసీ మరో కమిటీ వేసింది.

అయితే ఈ కమిటీ ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ప్రస్తుతం షెడ్యూల్‌‎తో రావడంతో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వైపు పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కవ్వంపల్లి తన అభ్యర్థిత్వం కోసం పీసీసీకి ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు. ఒక వేల కవ్వంపల్లికే టిక్కెట్ ఇవ్వాలని అనుకుంటే మరోసారి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. సత్యనారాయణ మానకొండూరు నుంచి కాంగ్రెస్ తరఫున రెండుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మొత్తం మీద రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటిస్తుందని, అభ్యర్థి ఎంపిక చివరి దశలో ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిని రేపు ప్రకటించబోతోందని… ఎవరిని బరిలోకి దించడం అనే దానిపై ఇవాళ చర్చలు జరపనున్నారు రాష్ట్రస్థాయి నేతలు.’

 

Read also.. politics live video: మళ్ళీ హీటెక్కిన హుజూరాబాద్… షెడ్యూల్ విడుదలతో మొదలైన అసలు రచ్చ..(లైవ్ వీడియో)