TRS vs BJP: ఢిల్లీపై టీఆర్‌ఎస్‌ దండయాత్ర.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న రాజకీయాలు..!

TRS vs BJP: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు పార్టీల మధ్య రోజురోజుకు రాజకీయాలు రక్తి కడుతున్నాయి. హుజురాబాద్‌..

TRS vs BJP: ఢిల్లీపై టీఆర్‌ఎస్‌ దండయాత్ర.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న రాజకీయాలు..!
Follow us

|

Updated on: Jan 31, 2022 | 8:51 AM

TRS vs BJP: తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు పార్టీల మధ్య రోజురోజుకు రాజకీయాలు రక్తి కడుతున్నాయి. హుజురాబాద్‌ (Huzurabad) ఉప ఎన్నికల తర్వాత జోరుమీదున్న బీజేపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇదే సమయంలో బీజేపీకి కాలు కాదు కదా కనీసం వేలు పెట్టే అవకాశం ఇవ్వొద్దని టీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది. రెండు పార్టీల మధ్య విమర్శలు హోరాహోరీ జరుగుతున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలు(Parliament Session) జరగబోతున్నాయి. తెల్లారితే కేంద్ర బడ్జెట్. ఓవైపు టీఆర్‌ఎస్‌ (TRS), బీజేపీ (BJP) మధ్య డైలాగ్‌ వార్. ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణకు ఏంచేశారని ప్రశ్నిస్తోంది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. ప్రతిదానికి కేంద్రం మీద నెపం నెట్టడమేనా అని కౌంటర్ ఇస్తున్నారు కమలనాథులు. ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తామని బీజేపీ అంటే.. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేట్‌పరం చేసి..ఉద్యోగుల్ని రోడ్డున పడేసింది మోదీ కాదా అంటూ నిలదీస్తున్నారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటం ఆసక్తిగా మారింది. పార్లమెంట్‌ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలతో స‌మావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్‌. ఇప్పటి వరకు కేంద్రంపై కాస్త పట్టువిడుపుతో వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ ఇకపై పూర్తిస్థాయిలో దూకుడు ప్రదర్శించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.

టీఆర్‌ఎస్‌ – కేంద్ర ప్రభుత్వం మధ్య లేఖల వార్‌..

కొద్ది రోజులుగా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య లేఖల వార్‌ నడిచింది. కేంద్రానికి రావాల్సిన అభివృద్ధి నిధులపై లేఖల ద్వారా నిలదీస్తూ వచ్చారు సీఎం కసీఆర్‌. సింగరేణి బొగ్గుగనుల వేలం, IAS సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు, ఎరువుల ధ‌ర‌ల‌పెంపుపై సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి ఇటీవల వరుసగా లేఖలు రాశారు. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేఖపోవడంతో ఈ అంశాలను పార్లమెంటులోనే తేల్చుకోవాలని సీఎం కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌లో మార్పులకు సిద్ధమవుతున్న కేంద్రానికి.. రాష్ట్రాల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ కొత్త ప్రతిపాదనల ప్రకారం, ఐఏఎస్‌ల నియామకం, బదిలీలపై సర్వాధికారాలూ కేంద్రానికే దక్కనుండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరుగా లేఖలు రాశారు. ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ మార్పును సీఎం కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సింగరేణి బొగ్గు గనుల వేలంపై టీఆర్‌ఎస్‌ వ్యతిరేకం..

తెలంగాణలో సింగరేణి బోగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీకి గతంలో లేఖ రాశారు. ఏటా 65 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ విద్యుత్కేంద్రాల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తుందని సీఎం లేఖ లో పేర్కొన్నారు.

ఇక ఎరువుల ధ‌ర‌ల పెంపుపై ప్రధాని న‌రేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ మరో లేఖాస్త్రం సందించారు. పెరిగిన ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించాల‌ని, కోట్ల మంది రైతుల త‌ర‌పున విజ్ఞప్తి చేస్తున్నాన‌ని కేసీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. 2022 వ‌ర‌కు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామ‌ని 2016లో ప్రకటించారు. ఇంత వ‌ర‌కు అతీగ‌తీ లేదు. రైతాంగం ఇప్పటికే తీవ్ర న‌ష్టాల్లో ఉంద‌న్నారు. ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం పెరిగాయి.

ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవ‌సాయాన్ని కార్పొరేట్ శ‌క్తుల‌కు క‌ట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గ‌త ఐదేండ్లలో ఇన్‌పుట్ కాస్ట్ రెట్టింపు అయింద‌న్నారు సీఎం కేసీఆర్‌. గుడ్డిగా కేంద్రం ఎరువుల ధ‌ర‌ల‌ను పెంచుతోంది. యూరియా, డీఏపీ వినియోగం త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌కు చెబుతున్నారు. ఎరువుల ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోగా, ఆ భారాన్ని రైతుల‌పై నెడుతున్నారు. దేశంలోని కోట్లాది రైతుల ప‌క్షాన చెబుతున్నా.. ఎరువులు స‌బ్సిడీపై ఇవ్వాలి. రైతుల పెట్టుబ‌డి మొత్తాన్ని త‌గ్గించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్‌ తన లేఖలో కోరారు.

మంత్రి కేటీఆర్‌ కూడా ఇటీవల కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలాసీతారామన్‌కు రాశారు. రాబోయే బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన నిధుల గురించి అంశాల వారీగా లెటర్‌లో వివరించారు. తెలంగాణలో నేషనల్ డిజైన్ సెంటర్‌తోపాటు.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ -నాగపూర్ ఇండస్ట్రియల్‌ కారిడార్లు… హైదరాబాద్ ఫార్మా సిటీ, నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్- జహీరాబాద్ నోడ్‌ల అభివృద్ధికి 6 వేల కోట్లు కేటాయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సింగరేణి బొగ్గుగనుల వేలం, IAS సర్వీస్‌ రూల్స్‌లో సవరణలు, ఎరువుల ధ‌ర‌ల‌పెంపుపై ఉభ‌య‌స‌భ‌ల్లో నిలదీయనున్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. వీటితో పాటు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న నీటి పంప‌కాలు, విభ‌జ‌న సమస్యలు, SC వ‌ర్గీక‌ర‌ణ‌, రిజ‌ర్వేష‌న్ల పెంపు, వ‌రిధాన్యం కొనుగోలుపై ప్రశ్నించనున్నారు. ఏడేళ్లలో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటూ ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు టీఆర్ఎస్ మంత్రులు

ఇక సీఎం కేసీఆర్‌ నేష‌న‌ల్ పాలిటిక్స్‌పై ఫోక‌స్ పెట్టారు. రాష్ట్రాల సమస్యల్ని కేంద్రం ప‌ట్టించుకోవ‌డంలేదంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇత‌ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తోనూ మంత‌నాలు జ‌రుపుతున్నారు. వ‌రుస‌గా BJP వ్యతిరేక శక్తులు.. క‌మ్యునిస్టు పార్టీల నేత‌ల‌తో భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రజా, రైతు వ్యతిరేక BJP సర్కారుని గద్దె దించాలంటూ KCR పిలుపునిచ్చారు. ఈ పరిణామాల క్రమంలో పార్లమెంట్‌లో బీజేపీపై గులాబీ దళం దండయాత్ర ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చదవండి:

UP Election 2022: ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి చిక్కు సమస్య.. కుస్తీ పడుతున్న ప్రధాన పార్టీలు..

Andhra Pradesh: టీడీపీ అత్యాచార దొంగలతో “సంకల్ప దీక్షలు” చేస్తారా?.. విజయవాడ ఘటనపై రోజా ఫైర్..