ZPTC MPTC Elections : పరిషత్ ఎన్నికల విషయంలో వెనక్కి తగ్గేది లేదు.. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న వర్లరామయ్య
AP ZPTC MPTC Elections : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని..
AP ZPTC MPTC Elections : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని టీడీపీ నేత వర్లరామయ్య చెప్పారు. హైకోర్టు తీర్పు అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ డివిజన్ బెంచ్ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. హైకోర్టు ధర్మాసనం నిర్ణయాన్ని అప్పీల్ చేస్తామని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలను నిర్వహిస్తున్నారని వర్ల దుయ్యబట్టారు. అందుకే తాము ఎన్నికలను బహిష్కరించామని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు.
ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిన్నటి నుంచి కొనసాగిన ఉత్కంఠకు ఇవాళ తెరపడిన సంగతి తెలిసిందే. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేరకు బుధవారం నాడు హైకోర్టు ధర్మాసనం మధ్యాహ్నం తన తీర్పును వెల్లడించిండి. ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన అభ్యర్థనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, కౌంటింగ్ ప్రక్రియను మాత్రం నిలిపివేయాలని షరతు విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఎన్నికల ఫలితాలను ప్రకటించవద్దని ఎస్ఈసీని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది.
కాగా, గురువారం జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా నోటిఫికేషన్ లేదని భావించి ఎన్నికల నిర్వహణను నిలుపుదల చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన 4 వారాల ఎన్నికల కోడ్‌ను అమలు చేసేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తాజా ఉత్తర్వులతో పరిషత్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది.
Read also : తెలంగాణ గడ్డపై యాక్టివ్ అయిన జనసేన, వరంగల్ గ్రేటర్ వార్‌లో యుద్ధానికి సై.. భారీ ర్యాలీతో సమరశంఖం