AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాట జాతీయ పార్టీలు చక్రం తిప్పేనా..?

తమిళనాడులో మునుపెన్నడు లేని విధంగా ఈసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా రెండు జాతీయ పార్టీలు బలమైన కూటమితో లోకల్ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి.

తమిళనాట జాతీయ పార్టీలు చక్రం తిప్పేనా..?
Balaraju Goud
| Edited By: |

Updated on: Nov 02, 2020 | 6:09 PM

Share

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో ముగ్గురు కన్నడ ప్రముఖులు ప్రధాన పాత్రను పోషించనున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల ఏర్పాటు, ఎన్నికల వ్యూహరచన తదితర రాజకీయ వ్యవహారాలన్నింటినీ ఈ ముగ్గురూ నేతలే నిర్వర్తించబోతున్నారు. తమిళ రాజకీయాల్లో ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల వ్యూహరచనలన్నీ విభిన్నంగా వుంటాయి. ఏ పార్టీ ఏ ద్రావిడ పార్టీతో జతకడుతుందో చివరి క్షణం వరకూ ఎవరూ ఊహించలేరు. ఆఖరి క్షణంలో కూటముల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. రాష్ట్రంలో పాలనాననుభవం కలిగిన ప్రధాన పార్టీలు అన్నాడీఎంకే, డీఎంకే సమ ఉజ్జీలుగా ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో పార్టీలతో ఏర్పరచుకునే పొత్తులను బట్టే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. 2016లో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఏ ప్రధాన రాజకీయ పార్టీలతోనూ పొత్తుపెట్టుకోకుండా ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేయలేకపోవడమే అంటారు రాజకీయ విశ్లేషకులు.

జాతీయ పార్టీల తీరు ఇలా వుంటే పలుమార్లు రాష్ట్రాన్ని పరిపాలించిన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు నేడు కార్పొరేట్‌ సంస్థలపై ఆధారపడి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్నాయి. గతంలో మాదిరిగా పార్టీ సీనియర్‌ నేతలు వ్యూహరచనలు చేసే పద్ధతి మాయమై కార్పొరేట్‌ కంపెనీల నుంచి సలహాలు, సూచనలు తీసుకునే పరిస్థితికి ఈ రెండు పార్టీలూ చేరుకున్నాయి. ప్రముఖ ఎన్నికల వ్యూహరచనకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించబోతున్నారు.

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సహా ఆ పార్టీ సీనియర్‌ నేతలందరూ ప్రస్తుతం ప్రశాంత్‌కిశోర్‌ సలహాలను తుచ తప్పకుండా పాటిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ బీహార్‌కు చెందినవారు. ఆయన టీమ్‌లో పనిచేస్తున్న సునీల్‌ విడిపోయి ప్రత్యేక ఎన్నికల వ్యూహరచన సంస్థను నడుపుతున్నారు. వచ్చే యేడాది జరు గనున్న తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది గురువా? లేక శిష్యుడా? అనే ప్రశ్న ఆసక్తిగా మారు తోంది. వారిద్దరిలో ఎవరి వ్యూహరచనలు సత్ఫలితాలను ఇస్తాయో వేచిచూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కన్నడ ప్రముఖులే తమిళ పార్టీల తలరాతను మార్చనున్నారంటే అతిశయోక్తి కాదు.

తమిళనాడులో మునుపెన్నడు లేని విధంగా ఈసారి రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా రెండు జాతీయ పార్టీలు బలమైన కూటమితో లోకల్ సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల పరువు ప్రతిష్టలను కాపాడే బాధ్యతలను ఇరువురు కన్నడ ప్రముఖులకు అప్పగించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన దినేష్‌ గుండూరావు, సీటీ రవిలను రంగంలోకి దింపాయి. వీరిద్దరూ కూడా కర్నాటక రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. ఇక, అన్నాడీఎంకే రాజకీయ సలహదారు సునీల్‌ కూడా ఆ రాష్ట్రానికి చెందినవారే.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అప్పుడే పావులు కదుపుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా దినేష్‌ గుండూరావు నియమించింది. రాష్ట్రంలో బలమైన కూటమిలో కాంగ్రెస్‌ పార్టీని చేర్చటం, కూటమికి నాయకత్వం వహించే డీఎంకేతో సీట్ల కేటాయింపులపై చర్చలు జరుపటం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే బాధ్యత ఈయనకే అప్పగించింది కాంగ్రెస్ అధినాయకత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకున్న అంగబలమెంతో, పార్టీ నాయకుల మధ్యగల సయోధ్య, విబేధాలు వంటి విషయాలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్ఠానానికి ఆయన చేరవేయనున్నారు.

ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా దూకుడు పెంచింది. బీజేపీ జాతీయ నాయకుడు సీటీ రవి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా నియమించింది. ఇప్పటివరకు తమిళనాడు పార్టీ వ్యవహారాలను సీనియర్‌ నేత మురళీధరరావు చూసుకునేవారు. తాజాగా ఆయనకు బదులుగా సీటీ రవిని పార్టీ అధిష్ఠానం నియమించింది. బీజేపీ జాతీయ కమిటీ కార్యదర్శిగా ఉన్న సీటీ రవి ఎన్నికల వ్యూహరచన చేయడంలో మంచి దిట్ట. తమిళనాట తామరను వికసింపజేసి పార్టీ ప్రతిష్టను పెంపొందించగలరన్న నమ్మకంతోనే బీజేపీ అధిష్టానం సీటీ రవిని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే సీటీ రవి బీజేపీ రాష్ట్ర శాఖలో తన మార్క్ మొదలు పెట్టారు. పక్కా వ్యుహంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో రవికి మంచి పేరుంది. తమిళనాడు రాజకీయాల్లో కర్ణాటకకు చెందిన నేతలు ఇప్పుడు చక్రం తిప్పబోతున్నారు. వీరిద్దరి వల్ల రెండు పార్టీలూ పొందే రాజకీయ ప్రయోజనా లను బట్టి కర్నాటకలో వారి ఇమేజ్‌ పెరగటమో తగ్గటమో జరుగుతుంది.