Sharad Pawar: సమయం ఆసన్నమైంది.. ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటారా?

పక్షవాతానికి గురైన శరద్ పవార్, సరిగ్గా మాట్లాడలేని స్థితిలో సైతం రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు.

Sharad Pawar: సమయం ఆసన్నమైంది.. ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటారా?
Sharad Pawar
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 24, 2024 | 10:57 PM

ఏ ఒక్కరూ ఊహించని రీతిలో వచ్చిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. అందులో ముఖ్యంగా ఘోర పరాజయం మూటగట్టుకున్న మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి పార్టీల్లో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ సారథ్యంలోని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (NCP) మనుగడ కొనసాగించేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే)తో కలిసి పొత్తుల్లో భాగంగా 86 స్థానాల్లో పోటీచేసిన శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 10 సీట్లలో మాత్రమే గెలిచింది. కూటమిలో అత్యధికంగా 103 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్ 16 సీట్లను మాత్రమే గెలుచుకోగా, 92 స్థానాల్లో పోటీ చేసిన శివసేన (UBT) 20 స్థానాల్లో గెలిచి, కూటమిలో పెద్దపార్టీగా అవతరించింది.

అయినప్పటికీ విపక్ష కూటమిలో ఏ ఒక్క పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన 10% సీట్లు (29) రాలేదు. ఈ మూడు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి 82 ఏళ్ల వృద్ధ నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వం వహిస్తుండగా.. ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీకి 84 ఏళ్ల కురువృద్ధుడు శరద్ చంద్ర పవార్ సారథ్యం వహిస్తున్నారు. వృద్ధ నేతల నేతృత్వంలోని పార్టీలను ప్రజలు తిరస్కరించారని దీన్ని బట్టి అర్థమవుతోంది. సరిగ్గా చెప్పాలంటే.. కాటికి కాలుచాచిన వయస్సులో కుర్చీ కోసం పడే తాపత్రయం జనానికి విసుకు తెప్పించిందన్న విశ్లేషణలు ఉన్నాయి. పక్షవాతానికి గురైన శరద్ పవార్, సరిగ్గా మాట్లాడలేని స్థితిలో సైతం రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు.

విరమణకు సమయం ఆసన్నమైంది

శరద్ పవార్ దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చక్రం తిప్పిన రాజకీయ ఉద్ధండుడు. కాంగ్రెస్‌ను వీడి సొంతంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని స్థాపించి, మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కేంద్రంలో అనేక సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. అలాంటి నేత సరైన సమయంలో రాజకీయాల నుంచి తప్పుకుంటే బావుండేదని ఆయన్ను అభిమానించే నేతలు చెబుతుంటారు. రాజకీయ వారసత్వాన్ని తన కుమార్తె సుప్రియా సూలే, తన సోదరుడి కుమారుడైన అజిత్ పవార్‌లలో ఎవరికి ఇవ్వాలో తేల్చుకోలేకపోయారో, మరే కారణమో.. ఆయన మాత్రం పార్టీ నాయకత్వాన్ని విడిచిపెట్టలేదు.

ఒకదశలో రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు పార్టీ శ్రేణులు వ్యతిరేకించాయన్న కారణంతో మళ్లీ పగ్గాలు చేపట్టారు. పార్టీ పగ్గాలు తనకు దక్కకపోయేసరికి అజిత్ పవార్ వేరు కుంపటి పెట్టి భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమిలో చేరిపోయారు. కుడి భుజం అనుకున్న అజిత్ పవార్ చేజారిపోవడం ఆయన నేతృత్వంలోని పార్టీకి శరాఘాతంగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ కంటే తన నేతృత్వంలోని పార్టీకే మెరుగైన ఫలితాలు దక్కడంతో ఊపిరి పీల్చుకున్న శరద్ పవార్, తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌లో కాపుల మాదిరిగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన మరాఠా సామాజికవర్గంలో గట్టి పట్టున్న శరద్ పవార్.. ఈసారి తన వర్గం ఓట్లను కూడా నిలుపులేకపోయారు. అదే మరాఠా సామాజికవర్గానికి చెందిన శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేతో పాటు శరద్ పవార్‌తో విబేధించి మరీ పార్టీని చీల్చిన అజిత్ పవార్ ఈ వర్గం ఓట్లను చాలావరకు చీల్చారు. దీంతో బలమైన సొంత ఓటుబ్యాంకు సైతం చెదిరిపోయింది. కేవలం 10 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. పైగా ఆ 10 మందిలో చివరి వరకు ఎంతమంది తనతో కలసి సాగుతారన్నది చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీజేపీ కన్నేస్తే మొత్తంగా మొత్తం 10 మందిని తన్నుకుపోగలదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేనప్పుడు రాజ్యసభలోనూ సీటు దక్కదు. ఈ పరిస్థితుల్లో మరో పరాభవం ఎదురయ్యే వరకు వేచిచూడకుండా.. ముందే రిటైర్మెంట్ ప్రకటించి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

సీసాలు పాతవే.. సారాయి పాతదే!

“కొత్త సీసాలో పాత సారా” అనే సామెతను ఏ సందర్భంలో ప్రయోగిస్తారో అందరికీ తెలుసు. కానీ ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి చూస్తుంటే… సీసాలు పాతవే, సారాయి పాతదే అన్న చందంగా ఉంది. పార్టీలు పాతవే. నాయకత్వం పాతదే. ఎనిమిది దశాబ్దాలు పైబడిన వయస్సు కల్గిన కురువృద్ధ నేతల సారథ్యంలోని ఈ రెండు పార్టీలు యువ ఓటర్ల మనోగతాన్ని అర్థం చేసుకోవడం విఫలమవుతున్నాయి. ఫలితంగా ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నాయి. అడపా దడపా ఎక్కడైనా గెలుపొందినా.. అది ప్రత్యర్థుల బలహీనత కారణంగానే తప్ప ఈ నేతల ఘనత కాదన్నది జగమెరిగిన సత్యం.

ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రిటైర్మెంట్ గురించే ప్రశ్నలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటికి ఆయన బదులిస్తూ.. తన రిటైర్మెంట్‌ను రాజకీయ ప్రత్యర్థులు నిర్ణయించలేరని సమాధానమిచ్చారు. ఇలాంటి ఫలితాలు ఎవరికైనా ఎదురైతే పరాభవంతో ఎవరైనా ఇంట్లోనే కూర్చుంటారని, కానీ తాను అలాంటి వ్యక్తిని కాదని చెప్పారు. పార్టీ శ్రేణులు ఇలాంటి ఫలితాన్ని ఏమాత్రం ఊహించలేదని, అందుకే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకే తాను రాజకీయ క్షేత్రంలో కొత్త ఉత్సాహంతో తిరుగుతున్నానని చెప్పుకొచ్చారు. ఎనిమిది పదుల వయస్సులో ఆ ఉత్సాహాన్ని ప్రదర్శించడం ప్రశంసనీయమే అయినప్పటికీ.. నాయకత్వ పగ్గాలను ఇంకా పట్టుకుని వేలాడడంతో కొత్త నాయకత్వం ఎదగలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని గ్రహించి ఇకనైనా ఆయన క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెబుతారా అన్న ఆశతో సొంత పార్టీలోనే అనేక మంది నేతలు ఎదురుచూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.