రాజ్‌భవన్ వైపు డీఎస్ చూపు…!
ఒకప్పుడు పార్టీ సారధిగా ఉన్న నేత నేడు ఏ గట్టుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అతనే ధర్మపురి శ్రీనివాస్. స్టేట్ పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని వ్యక్తి. అనేక పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు అనుభవించిన మూడు దశాబ్ధాల చరిత్ర అతనిది. బలమైన కేడర్, బలమైన సామాజికవర్గం అండగా ఉన్న నేత. అలాంటి నేతకు ఈ దశాబ్దం కలిసిరాలేదని చెప్పొచ్చు. 2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటినుంచి టీఆర్ఎస్ లో చేరేవరకు రాజకీయంగా డీఎస్ చాలా వెనుకబడిపోయారు. టీఆర్ఎస్ లో […]

ఒకప్పుడు పార్టీ సారధిగా ఉన్న నేత నేడు ఏ గట్టుకు వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అతనే ధర్మపురి శ్రీనివాస్. స్టేట్ పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని వ్యక్తి. అనేక పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు అనుభవించిన మూడు దశాబ్ధాల చరిత్ర అతనిది. బలమైన కేడర్, బలమైన సామాజికవర్గం అండగా ఉన్న నేత. అలాంటి నేతకు ఈ దశాబ్దం కలిసిరాలేదని చెప్పొచ్చు.
2009 లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటినుంచి టీఆర్ఎస్ లో చేరేవరకు రాజకీయంగా డీఎస్ చాలా వెనుకబడిపోయారు. టీఆర్ఎస్ లో చేరిన డీఎస్ ను సీఎం కేసీఆర్ మొదట పార్టీ సలహాదారుగా నియమించి, తర్వాత రాజ్యసభకు కూడా పంపించారు. కానీ డీఎస్ కొడుకు అరవింద్ బీజేపీనుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో తండ్రికి చెక్ పడింది. కొడుకుకు మద్దతిస్తున్నారని టీఆర్ ఎస్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటినుంచి డీఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. రాజ్యసభ ఎంపీ పదవి ఉండటంతో వేరే పార్టీలో చేరేందుకు సంశయిస్తున్నారు.
ఇక ఈ రాజకీయ దాడుగుమూతలకు తెర దించేయాలని డీఎస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కావాలనే ఆశ కలగానే మిగిలిపోయింది. దాంతో తన వయసుకు తగ్గ పదవి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ కు రిక్వెస్ట్ చేసుకున్నారట డీఎస్. ఇటీవల రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం మరి కొన్ని రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో ఆ లిస్ట్ లో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం అమిత్ షాను కలిసి తన కోరికను వెలిబుచ్చారట డీఎస్.
ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిసినప్పుడు కూడా అదే చర్చకు వచ్చిందట. దీనికి తోడు డీఎస్ తనయుడు అరవింద్ కూడా దీనికోసమే ప్రయత్నాలు చేస్తున్నారట. తండ్రికి ఏదో ఒక పదవి కన్ ఫర్మ్ చేసి కమలదలంలో చేర్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కుదిరితే గవర్నర్ పదవి.. లేకపోతే రాజ్యసభ ఎంపీ పదవితో సమానమైన నామినేటెడ్ పదవి ఇస్తే కమలం కండువా కప్పుకునేందుకు తాను రెడీగా ఉన్నానని డీఎస్ బీజేపీ హై కమాండ్ కు చెప్పారట. బీజేపీ పెద్దలనుంచి నిర్ణయం వస్తే డీఎస్ త్వరలోనే కమలం కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.