తెలంగాణ పీసీపీ అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. వాడీవేడీ కామెంట్స్‌తో కాకరేపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి అంటూ తాజాగా హాట్ కామెంట్స్ చేశారు. అలా కొట్టడంలో తానూ ముందుటానని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే అధికార పార్టీకి అమ్ముడుపోయే సన్నాసులకు సిగ్గు ఉండాలి అంటూ ఘాటు పదజాలం ఉపయోగించారు. పార్టీ పిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుంటే, అవసరమైతే స్పీకర్ పై చర్యలకు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో పశువులను కొన్నట్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఇచ్చింది సొనియా అని…. ప్రజలకు సొనియాపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉందని.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు మంచి గుణపాఠం చెబుతారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
జూలై 7వ తేదీన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు పీసీసీ బాధ్యతలు తీసుకుంటానని తెలిపారు. తాను ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తానని అన్నారు. రైతులకు సంబంధించి తమ వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని, పార్టీ ఆమోదం తర్వాత దానిని వెల్లడిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో భూమిలేని నిరుపేదలకు ప్రయోజనం కలిగించే పథకాలు ఏమీ లేవని విమర్శించారు. కేసీఆర్ తెచ్చిన ప్రతి పథకం ఉన్న వాళ్లకే ఉపయోగకరంగా ఉందని ఆరోపించారు.
Also Read: వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో తెరపైకి కొత్త వ్యక్తులు.. అసలు కృష్ణయ్య యాదవ్ ఎవరంటే..?