PM Modi Gets Emotional: ‘నా చిన్నతనంలో ఇలాంటి ఇల్లు ఉండి ఉంటే..’ ప్రసంగిస్తూ కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 8 అమృత్ ప్రాజెక్ట్‌లకు (AMRUT Scheme) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 19) శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. అనంతరం మోదీ ప్రసంగిస్తూ చిన్ననాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోధ్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన-అర్బన్ (PMAY-U) పథకం కింద మహారాష్ట్రలో 90 వేలకుపైగా ఇళ్లను..
షోలాపూర్, జనవరి 19: మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 8 అమృత్ ప్రాజెక్ట్‌లకు (AMRUT Scheme) ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 19) శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్ ఇది. అనంతరం మోదీ ప్రసంగిస్తూ చిన్ననాటి రోజులను జ్ఞాపకం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఒకింత భావోధ్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన-అర్బన్ (PMAY-U) పథకం కింద మహారాష్ట్రలో 90 వేలకుపైగా ఇళ్లను పంపిణీ చేశారు. షోలాపూర్‌లోని రాయ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి చెందిన చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్ లూమ్ కార్మికులు, ర్యాగ్ పికర్స్, బీడీ కార్మికులు, డ్రైవర్లు, తదితరులకు కొత్తగా నిర్మించిన 15 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు.
‘నా చిన్న తనంలో ఇలాంటి ఇంట్లో ఉండాలనుకున్నాను’
అనంతరం మోదీ సభలో ప్రసంగించారు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీని ఈ రోజు ప్రారంభించాం. ఇళ్లను చూడటానికి వెళ్లినప్పుడు నా బాల్యం గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో నివసించే అవకాశం వస్తుందా అని అనుకున్నాను.. అంటూ భావోధ్వేగానికి గురయ్యారు. అనంతరం గధ్గత స్వరంతో మాట్లాడుతూ.. కాని నేడు వేలాది కుటుంబాల కలలు నెరవేరడం చూసి నాకు సంతృప్తి కలిగింది. వారి ఆశీర్వాదాలే నాకు అతిపెద్ద ఆస్తి. బడుగు వర్గాల వారికి గృహాలు అందిచాలనే మా నిబద్ధతలో ఒక కీలక మైలురాయి అధిగమించామన్నారు. హౌసింగ్ ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మకమైన PMAY-అర్బన్ పథకంలో భాగంగా పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలతో కూడిన పక్కా గృహాలను అందించడం ద్వారా వారి గృహ అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుర్తు చేసుకున్నారు.
‘మీరంతా రామ జ్యోతి వెలిగించాలి’
శ్రీరాముడి ఆశయాలను అనుసరించి దేశంలో సుపరిపాలన, నిజాయితీ రాజ్యమేలేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జనవరి 22న ‘రామజ్యోతి’ని వెలిగించాలని ప్రజలను కోరారు. ప్రజల జీవితాల నుండి పేదరికాన్ని తొలగించడానికి ఇది ఒక ప్రేరణ అని ఆయన అన్నారు. ‘మోదీ హామీ ఇస్తే.. అది నెరవేర్పు హామీ’ అని ఆయన అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను గౌరవించాలని రాముడు మనకు బోధించాడు. పేదల సంక్షేమం, సాధికారత కోసం మేము నిర్దేశించిన అన్ని లక్ష్యాలను నెరవేరుస్తున్నామన్నారు. ఇళ్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి 10 ఏళ్లు పట్టిందని, ఈ సౌకర్యాల కొరత పేదలకు, ముఖ్యంగా మహిళలకు అవమానకరమని మోదీ అన్నారు. ‘ఇజ్జత్‌కీ గ్యారెంటీ’ కింద మహిళల కోసం 10 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామని, ఇప్పటివరకు నాలుగు కోట్లకు పైగా పక్కా ఇళ్లను నిర్మించామని మోదీ అన్నారు.
#WATCH | PM Modi gets emotional as he talks about houses completed under PMAY-Urban scheme in Maharashtra, to be handed over to beneficiaries like handloom workers, vendors, power loom workers, rag pickers, Bidi workers, drivers, among others.
PM is addressing an event in… pic.twitter.com/KlBnL50ms5
— ANI (@ANI) January 19, 2024
తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కార్మికుల గౌరవంపై దృష్టి సారించిందని ప్రధాని అన్నారు. పెద్ద కలలు కనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఆయన, ‘మీ కల నా సంకల్పం, అది మోదీ హామీ’ అని ఆయన అన్నారు.‘గరీబీ హఠావో’ అనేది గతంలో కేవలం నినాదం మాత్రమేనని, పథకాలు లబ్ధిదారులకు చేరలేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ ఉద్దేశం, విధానం, విధేయత స్పష్టంగా లేవని, అయితే తమ ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా ఉందని అన్నారు. ప్రజలకు అధికారం ఇవ్వడమే విధానమని, దేశం పట్ల తమకు పూర్తి విధేయత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రలోని 10,000 మంది లబ్ధిదారులకు పీఎం-స్వానిధి మొదటి, రెండవ విడతల పంపిణీని కూడా ఆయన ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.