AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబు, జగన్ ప్రధాని పీఠమెక్కినా ‘హోదా’ కుదరదు, పోలవరంకు కొత్తగా నిధుల కేటాయింపు అక్కర్లెద్దు, బడ్జెట్‌పై సుజనా మాట

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గురించి 'ఎన్నికల బడ్జెట్' అంటూ వైసీపీ నేతలు మాట్లాడ్డం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు...

బాబు, జగన్ ప్రధాని పీఠమెక్కినా 'హోదా' కుదరదు,  పోలవరంకు కొత్తగా నిధుల కేటాయింపు అక్కర్లెద్దు,  బడ్జెట్‌పై సుజనా మాట
Venkata Narayana
|

Updated on: Feb 01, 2021 | 11:01 PM

Share

కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ గురించి ‘ఎన్నికల బడ్జెట్’ అంటూ వైసీపీ నేతలు మాట్లాడ్డం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి అన్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ మౌలిక సదుపాయాలు పెంచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసుల ఉపసంహరణ కోసం చేసే ప్రయత్నాల్లో కొంతైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం చేయడం లేదని ఎద్దేవా చేశారు.

అక్రమ మార్గాలలో ఆంధ్రప్రదేశ్ చేసే అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిమీద గుదిబండలా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని సార్లు ఢిల్లీ పర్యటన జరిపిన ఏపీ సీఎం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లలేదని దెప్పిపొడిచారు. ఢిల్లీ వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైన సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021 బడ్జెట్ చాలా గొప్పగా ఉందని సుజనా అన్నారు.

విద్య, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఉచిత వాక్సిన్ కోసం పెద్దఎత్తున నిధులు కేటాయించడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడిలో మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడంలో కూడా భారతదేశం విజయం సాధించిందని అన్నారు. కుదేలైన పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు.

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఇప్పటికే అనేక మార్లు వివిధ రకాలుగా స్పందించిన ఎంపీ సుజనా చౌదరి ఈ సారి మరో టైపులో రియాక్టయ్యారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ప్రధాని పీఠమెక్కినా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని సుజనా చౌదరి తేల్చి చెప్పారు. దానికి బదులు రాష్ట్రానికి కావాల్సినవేంటో కేంద్రాన్ని అడిగి సాధించుకోవాలని సూచించారు. , అడగందే అమ్మైనా అన్నం పెట్టదన్న సామెతను గుర్తుపెట్టుకోవాలని సుజనా చెప్పుకొచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా నిధులు కేటాయింపు జరపాల్సిన అవసరమే లేదని, గత బడ్జెట్లలోనే నిధుల సమీకరణకు నాబార్డుతో లంకె పెట్టారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.