కేంద్రం ఇచ్చిన నిధుల్నే తెలుగు రాష్ట్రాలు వాడట్లేదు, రాజకీయం కోసమే బడ్జెట్‌పై విమర్శలు, పోలవరంపై సభ సాక్షిగా పూర్తి సమాచారం: జీవీఎల్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రం..

  • Venkata Narayana
  • Publish Date - 11:41 pm, Mon, 1 February 21
కేంద్రం ఇచ్చిన నిధుల్నే తెలుగు రాష్ట్రాలు వాడట్లేదు, రాజకీయం కోసమే బడ్జెట్‌పై విమర్శలు, పోలవరంపై సభ సాక్షిగా పూర్తి సమాచారం: జీవీఎల్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బడ్జెట్‌లో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన నిధుల్లో మొండి చెయ్యి చూపినట్లు కాదని వెల్లడించారు. పోలవరం గురించి రెండ్రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ వస్తుందని తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయం కోసం తానే ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నలు అడిగానని, సభలోనే వాటికి సమాధానం లభిస్తుందని తెలిపారు.

రాజకీయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయని జీవీఎల్ మండిపడ్డారు. దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరుస్తూ, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేలా ఈ బడ్జెట్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఆర్ధిక వ్యవస్థకు ఊపునిచ్చే అద్భుతమైన బడ్జెట్ ఇదని ఆయన కొనియాడారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల ఉద్యోగ, ఉపాధి కల్పన పెరుగుతుందని జీవీఎల్ అన్నారు.

కేంద్రం ప్రభుత్వం ఆరోగ్యరంగంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెంచారని, రెట్టింపు కంటే ఎక్కువ శాతం నిధులు కేటాయించారని జీవీఎల్ వెల్లడించారు. ఆరోగ్యరంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందని సూత్రీకరించారు. మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు లక్షకోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. కొన్ని వస్తువులపై సెస్ విధించడం ద్వారా మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు పెంచనున్నారని వివరించారు.

మంచినీటి సదుపాయం కోసం ‘జలజీవన్ మిషన్’ నిధులు బడ్జెట్ లో కేటాయించారని జీవీఎల్ చెప్పారు. ప్రపంచమంతా ఆర్ధికంగా నష్టపోయినా, దేశంలో ఆత్మనిర్భర్ నినాదంతో ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే విధంగా బడ్జెట్ రూపకల్పన చేసిన ప్రధాన మంత్రి, ఆర్ధిక మంత్రులకు అభినందనలు తెలియజేస్తున్నానని జీవీఎల్ అన్నారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని, అయినాకాని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజమని కొట్టిపడేశారు.