KCR MIND-GAME: విపక్షాలతో కేసీఆర్ మైండ్ గేమ్.. వ్యూహాత్మకంగానే ముందస్తు ఫీలర్లు.. ఇంతకీ గులాబీ బాస్ ద్విముఖ వ్యూహమేంటి ?
కేటీఆర్ ప్రకటన వ్యూహాత్మకమా లేక నిజంగానే అధికార పార్టీలో ముందస్తు యోచన లేదా అన్నది ఇదమిత్తంగా తేలనప్పటికీ.. ముందస్తు అన్నది కేసీఆర్ మైండ్ గేమ్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
KCR MIND-GAME WITH BJP AND CONGRESS: గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు(CM KCR) విపక్ష పార్టీల నేతలకు మెంటల్ ఎబిలిటీ పరీక్షలు పెడుతున్నారా? ముందస్తు పేరిట గత ఆరేడునెలలుగా విపక్ష నేతలతో మైండ్ గేమ్ ఆడుతున్నారా ? తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) చేసిన వ్యాఖ్యలు వింటే ఈ సందేహం కలుగక మానదు. తెలంగాణ (Telangana)లో గత ఆరేడు నెలలుగా ఎన్నికలు రేపోమాపో అన్నట్లుగా రాజకీయ వర్గాలు చురుకుగా కనిపిస్తున్నాయి. మరీ చెప్పాలంటే గత నాలుగైదు నెలలుగా అయితే రేపో మాపో అసెంబ్లీ రద్దు చేసి.. ఏడాది చివరికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి అన్నంత హల్‌చల్ కనిపిస్తోంది. 2018లో విపక్షాలు రెడీగా లేని సందర్భం చూసి.. ఉన్నట్లుండి అసెంబ్లీని రద్దు చేసిన ఎన్నికలకు వెళ్ళారు KCR. విపక్ష పార్టీలను చావుదెబ్బ కొట్టారు. కాంగ్రెస్ పార్టీ(Telangana Congress) కేవలం 19 సీట్లు గెలుచుకోగా.. బీజేపీ (BJP) అయితే కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. 2018 నాటి నేపథ్యాన్ని మరచిపోలేకపోతున్న కాంగ్రెస్, బీజేపీలతో గత ఆరు నెలలుగా అదిగో అసెంబ్లీ రద్దు.. ఇదిగో అసెంబ్లీ రద్దు అన్న రీతిలో మైండ్ ఆడుతున్నారు గులాబీ బాస్. ప్రశాంత్ కిశోర్(Prashant Kishor)తో మంతనాలు, సర్వేల పేరిట మీడియాకు లీకులు, విపక్ష నేతలపై తిరుగులేని విధంగా విమర్శలు.. ఇలా రాజకీయాల్లో వేడిని రగిలిస్తూనే వున్నారు. ధాన్యం సేకరణ అంశంపై కేంద్రంపై అమీతుమీ అన్న టీఆర్ఎస్(TRS) వర్గాలు.. ఆనాటి నుంచే ముందస్తు ఊహాగానాలకు వ్యూహాత్మకంగా తెరలేపినట్లు అర్థమవుతోంది. దాంతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గులాబీ బాస్ మైండ్ గేమ్‌లో తమకు తెలియకుండానే పావులుగా మారారు. ముందస్తు వచ్చినా రాకున్నా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో యాక్టివిటీస్ పెంచేశారు. రాజకీయంగా తమ వ్యూహాలకు పదును పెట్టడం ప్రారంభించారు. పోటాపోటీ సభలు, పర్యటనలతో రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచారు. పాదయాత్రలు, డిక్లరేషన్ల పేరిట ప్రజలకు దగ్గరయ్యేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని వరంగల్(Warangal)కు రప్పించి ఎన్నికల హామీలను ప్రకటింపజేశారు. బీజేపీ నేతలు ఏకంగా తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్(Hyderabad) నగరంలో ఏర్పాటు చేశారు. ఓ వారం రోజుల పాటు తెలంగాణలో గల్లీ గల్లీలో కాషాయ జెండాలు రెపరెపలాడేలా చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ జాతీయ నేతను పర్యటించేలా ప్లాన్ చేశారు. తమ యాక్షన్ ప్లాన్ సక్సెస్ అయ్యిందన్న సంతోషంలో కమలదళం వుండింది. అయితే, జులై 15న మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన కేటీఆర్ (KTR).. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే 2023లో జరుగుతాయని వెల్లడించారు. ఈ ప్రకటన వ్యూహాత్మకమా లేక నిజంగానే అధికార పార్టీలో ముందస్తు యోచన లేదా అన్నది ఇదమిత్తంగా తేలనప్పటికీ.. ముందస్తు అన్నది కేసీఆర్ (KCR) మైండ్ గేమ్‌లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి అసెంబ్లీని రద్దు చేస్తామని కేసీఆర్ గానీ.. మరే ఇతర టీఆర్ఎస్ నేతగానీ అధికారికంగా ఎప్పుడు ప్రకటించలేదు. కానీ ఆ మేరకు మీడియాలో ఫీలర్లు వదిలారు. ఆ ఫీలర్ల ఆధారంగా 2018 పరిస్థితి పునరావృతం కాకూడదన్న ఆలోచనలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ యాక్టివిటీస్‌ని పెంచేసాయి. పాదయాత్రలు మొదలు పెట్టాయి. ధాన్యం సేకరణ అంశంపై కేంద్రంలోని బీజేపీపై టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. పనిలోపనిగా మార్కెట్ యార్డుల సందర్శన పేరిట ప్రజల్లో తిరిగేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. మాటల మంటలు రేపారు. చివరికి ధాన్యం సేకరణ అంశం ఓ కొలిక్కి రాకుండానే అన్ని పార్టీలు ఆ అంశాన్ని వదిలేశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీకు సంబంధించిన జీవో 317 ఆధారంగా బీజేపీ ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాల్లో యాత్రలు నిర్వహించింది. ఆ సందర్భంలో టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడం, వరంగల్ జైలుకు తరలించడం అత్యంత వివాదాస్పదమైంది. పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టించింది. అదేసమయంలో అసెంబ్లీ రద్దు అంశంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో వాటిని నిజమేననుకున్న విపక్షాలు యాత్రలను ముమ్మరం చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించారు. తొలివిడత పాదయాత్ర పెద్దగా హైలైట్ కాకపోయినా మలివిడత పాదయాత్రకు మాత్రం విశేషంగా మీడియా కవరేజీ లభించింది. గద్వాల జిల్లా ఆలంపూర్ సమీపంలోని జోగులాంబ (Jogulamba) దైవ సన్నిధి నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆరు జిల్లాల మీదుగా కొనసాగింది. మహబూబ్‌నగర్ (Mahboobnagar) సమీపంలోని భూత్‌పూర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) హాజరయ్యారు. పాదయాత్ర ముగింపు సభగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narenda Modi) ఇక్రిసాట్ సమ్మిట్‌కు వచ్చారు. అది అధికారిక సదస్సు కావడంతో రాజకీయ ప్రసంగాలకు ఆస్కారం లేకపోయింది. అయితేనేం మోదీ రాకను వినియోగించుకోవాలనుకున్న తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేట ఎయిర్ పోర్టు ఆవరణలో స్వాగత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ వేదికపై నుంచి మోదీ తెలంగాణలోకి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇదంతా మే నెలలో జరగగా.. ఆ తర్వాత జులై 2,3 తేదీలలో హైదరాబాద్ నగరంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ రకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలోనే పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే, బీజేపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు, విసురుతున్న సవాళ్ళపై ఏరోజుకా రోజు గులాబీ పార్టీ నేతలు ఎదురు దాడి చేస్తూనే వున్నారు. కేటీఆర్, హరీశ్ రావు తదితరులు బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రాపగాండపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందిస్తూనే వున్నారు. అడపాదడపా మీడియా ముందుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. తనదైన శైలిలో విపక్షాలను మరీ ముఖ్యంగా మోదీని లక్ష్యంగా చేసుకుని సునిశిత విమర్శలు, ఆరోపణలు చేస్తూనే వున్నారు. ఇందుకు ఉదాహరణగా జులై పదో తేదీన కేసీఆర్ రెండున్నర గంటల మీడియా మీట్‌ని చెప్పుకోవచ్చు.
గత రెండు, మూడు నెలలుగా కేసీఆర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్ టీమ్‌తో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయిస్తున్నారు. 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వుందని ఫీలర్లు వదులుతున్నారు. ఆ జాబితాలో తమ పేరుందా అన్న మీమాంసను సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పెంచుతున్నారు. తద్వారా వారంతా ప్రజల్లో తిరిగేలా చేస్తున్నారు. ఈ హడావిడి చూస్తే అసెంబ్లీ రద్దు దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనిపించక మానదు. కానీ అవన్నీ ముందు జాగ్రత్త చర్యలలో భాగమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సొంత ఎమ్మెల్యేలు అప్రమత్తంగా వుండడం, విపక్షాలు తన మైండ్ గేమ్‌కు అనుగుణంగా నడచుకోవడం ఇలా ద్విముఖ వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు తాజాగా అభిప్రాయపడుతున్నారు.