CM KCR : కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు రావలసిన నీటి వాటా కోసం రాజీ లేకుండా పోరాడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో అధికారులు, మంత్రులతో చర్చించారు. ఆరు గంటలకు పైగా జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నదీ జలాల వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతదూరమైనా వెళుతామని, అన్ని వేదికల మీద పోరాడుతామని పునరుద్ఘాటించారు. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలను చర్చించిన సీఎం కేసీఆర్ అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు.
నదీ జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను రాబట్టుకోవడంతో సహా, తెలంగాణ లిఫ్టులను నడిపించుకునేందుకు జలవిద్యుత్ ఉత్పత్తి ని కొనసాగించాలని రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ కు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందార్భాల్లో కేంద్రాన్ని ఒత్తిడిచేస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధమైంది.
ఈ సమావేశంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, సిఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, ఈఎన్సీ మురళీధర్ రావు, సిఎం వోఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ పాల్గొన్నారు.