తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ-జనసేన సమాలోచనలు.. అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై బి.జె.పి - జనసేన నేతలు సుధీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ లో మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో..

తిరుపతి ఉప ఎన్నికపై బీజేపీ-జనసేన సమాలోచనలు.. అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న సస్పెన్స్‌
Follow us

|

Updated on: Jan 25, 2021 | 1:03 PM

తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికపై బి.జె.పి – జనసేన నేతలు సుధీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్ లో మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహంపై చర్చించారు. లోక్ సభ స్థానం పరిధిలోని బి.జె.పి – జనసేన నాయకులు, శ్రేణులను సమాయత్తం చేయడం వంటి విషయాలపై దృష్టి పెట్టారు.

ప్రచారానికి బి.జె.పి. అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించడం వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చామని ఇరు పార్టీల నేతలు తెలిపారు. అయితే అభ్యర్ధి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధిని ఎంపిక చేయాలని నిశ్చయించామని అన్నారు.

పంచాయితీ ఎన్నికలపై కూడా చర్చించామని అన్నారు. ఎన్నికల కమిషన్ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని, అలా గౌరవించని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని అన్నారు.

ఈ సమావేశంలో బి.జె.పి. నుంచి కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ ఏపీ వ్యవహారాల సహాయ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ పాల్గొన్నారు. జనసేన పక్షాన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.