డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే.. స్వయంగా సర్జరీ చేసి యువకుడి పునర్జన్మ ప్రసాదించిన తెల్లం వెంకట్రావు
ఆపదలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మళ్లీ స్టెతస్కోప్ పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జన్ అందుబాటులో లేని క్లిష్ట సమయంలో, ఆయనే స్వయంగా డాక్టర్‌గా మారి ఐదు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి ఓ యువకుడికి పునర్జన్మనిచ్చారు.

ఆపదలో ఉన్న ఓ యువకుడి ప్రాణాలను కాపాడేందుకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మళ్లీ స్టెతస్కోప్ పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జన్ అందుబాటులో లేని క్లిష్ట సమయంలో, ఆయనే స్వయంగా డాక్టర్‌గా మారి ఐదు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి ఓ యువకుడికి పునర్జన్మనిచ్చారు.
వెంకటాపురం మండలం సుదిబాక గ్రామానికి చెందిన మడప భాస్కర్ అనే యువకుడు ఆరు నెలల క్రితం విద్యుత్ షాక్‌కు గురై 60 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. పైగా ఆర్థిక పరిస్థితి భారంగా మారడంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును ఆశ్రయించారు. స్పందించిన ఎమ్మెల్యే.. యువకుడిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గత రెండు నెలలుగా ప్రత్యేక పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించారు.
యువకుడికి అత్యవసరంగా స్కిన్ గ్రాఫ్టింగ్ సర్జరీ చేయాల్సి ఉండగా.. ఆసుపత్రిలో జనరల్ సర్జన్ అందుబాటులో లేరు. దీంతో స్వయంగా జనరల్ సర్జన్ అయిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రంగంలోకి దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందంతో కలిసి ఐదు గంటల పాటు శ్రమించి, యువకుడి తొడ, పొట్ట భాగంలో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
భద్రాచలం ఏరియా ఆసుపత్రికి అత్యున్నత వైద్య సేవలు అందించే సామర్థ్యం ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. తమ బిడ్డకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఎమ్మెల్యేకు, వైద్య బృందానికి జీవితాంతం రుణపడి ఉంటామని యువకుడి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
