భలా బండలనాగపూర్.. ఆభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన కుగ్రామం.. వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు
చుట్టూ బండరాళ్లు.. సేద్యానికి పనికిరాని భూములు.. సాగునీరే కాదు చుక్క తాగునీరు కూడా దొరకని పల్లె. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ఆ గ్రామం జిల్లాకే తలమానికంగా..
చుట్టూ బండరాళ్లు.. సేద్యానికి పనికిరాని భూములు.. సాగునీరే కాదు చుక్క తాగునీరు కూడా దొరకని పల్లె. ఇదంతా ఒకప్పుడు.. ఇప్పుడు ఆ గ్రామం జిల్లాకే తలమానికంగా మారింది. గతంలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అదే పల్లె.. పచ్చని ప్రకృతితో అన్ని రంగాల్లో అభివృద్ది సాదించి ఆదర్శ గ్రామంగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో అవార్డులను సైతం సాదించి బలా అనిపించుకుంటోంది. అదే ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని బండలనాగపూర్ గ్రామం. ఈ గ్రామం అభివృద్దిలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
బండల్నాగపూర్.. పేరుకు తగ్గట్టుగానే ఊరు చుట్టు పెద్ద పెద్ద బండలు. ఎటు చూసినా బీడు భూములు.. చుక్క నీరు పారే దారి లేక వర్షాదార పంల పైనే సాగు చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది తెలంగాణ రాక ముందు మాట.. స్వరాష్ట్రం సిద్దించాక స్వపరిపాలనలో బండల్నాగపూర్ కథే మారిపోయింది. ఇక్కడ ఎన్ని జెండాలున్నా గ్రామస్తుల అజెండా మాత్రం ఒక్కటే.. అదే గ్రామాభివృద్ది. ఆ సంకల్పంతోనే రాష్ట్రంలో ఎక్కడా సాద్యం కానీ అభివృద్దిని సంక్షేమ పథకాల అమలును సమష్టి కృషితో ఈ గ్రామం సాదించికుని చూపింది.
తెలంగాణ రాష్ట్రంలోనే మొదట బండలనాగపూర్‌లోనే రూ.5 కోట్లతో 100 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం జరిగింది. దళితబస్తీ పథకం కింద రాష్ట్రంలోనే ఎక్కువ మందికి లబ్ధి చేకూరింది కూడా ఈ గ్రామంలోనే. 120 మంది పేదలకు మూడెకరాల చొప్పున భూమి, రూ.60 లక్షల వరకు పెట్టుబడి సహాయం అందడంతో దశాబ్దం క్రితం వరకు వ్యవసాయ కూలీలు ఉన్న వారంతా రైతులుగా మారారు.
ఇక్కడి జనం సాగుకు ఎంత ప్రాముఖ్యత నిచ్చారో అదే స్థాయి లో విద్యకు ప్రాముఖ్యతనిచ్చారు. ప్రైవేట్ స్కూల్లకు టాటా బైబై చెప్పేసి అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా వీడీసీ ల ద్వారా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలలో ఊరంతా కలిసి వసతులు ఏర్పాటు చేసుకోవడంతో.. బండల్నాగపూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు 2016-17లో జాతీయస్థాయిలో స్వచ్ఛ విద్యాలయంగా, 2017-18లో జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. గ్రామంలో ప్రతి వీది స్బచ్చ వార్డుగా మార్చుకునేందుకు రూ.50 లక్షల ఎఫ్‌డీఎఫ్ నిధులతో మురుగు కాలువలు, సీసీ రోడ్లు, రూ.12.50 లక్షల ఉపాధిహామీ నిధులతో శ్మశాన వాటిక నిర్మాణం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.8 లక్షలతో ప్రధాన రహదారి సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, పూల మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు.
ఒకప్పుడు బండ రాళ్లు తప్ప ఏం కనిపించని ఈ గ్రామంలో మత్తడివాగు ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువ గ్రామం మీదుగా వెళ్లడంతో బీడు భూములు సైతం సాగులోకి వచ్చాయి. ప్రస్తుతం 2 వేల ఎకరాలు పచ్చని పంటలతో కనిపిస్తున్నాయి. మరో వైపు పండిన పంటలను నిల్వ చేసుకునేందుకు గోదాం నిర్మాణానికి గ్రామస్థులంతా కలిసి రెండెకరాల స్థలం సేకరించడంతో ప్రభుత్వం గతేడాది రూ.3 కోట్ల నాబార్డు నిధులతో గోదాం నిర్మాణంతో పాటు వాహనాల రాకపోకలకు రూ.2 కోట్లతో రహదారి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. బడి ఉన్న చోట గుడి కూడా ఉండాలన్న నిర్ణయంతో గ్రామస్తులు అందించిన రూ.10 లక్షల విరాళాలకు తోడు దేవాదాయ శాఖ ద్వారా మరో రూ.50 లక్షలు మంజూరు చేయడంతో శ్రీరామాలయాన్ని గ్రామంలో నిర్మిస్తున్నారు. మరో వైపు పల్లెప్రకృతి వనాన్ని సైతం బండరాళ్ల మధ్య ఏర్పాటు చేసి కాదేది పచ్చదనానికి అనర్హం అని నిరూపిస్తున్నారు బండల్నాగపూర్ వాసులు. ఈ గ్రామంలోని పిల్లలు ఉన్నత విద్య చదివేందుకు గురుకుల పాఠశాల ను సైతం ఏర్పాటు చేసుకునేందుకు సకల్పించారు. ఆ కల కూడా త్వరలోనే నెరవేరే అవకాశాలున్నాయి.
Read More:
తాడిపత్రిలో రసవత్తరంగా చైర్మన్ ఎన్నిక.. టీడీపీ, వైసీపీలకు సమానబలం.. కీలకంగా మారిన ఎక్స్ అఫీషియోలు